బ్లాక్‌బస్టర్ చిత్రం ‘కాంతార’ (Kantara) లోని పవిత్రమైన దైవ రూపాన్ని మిమిక్రీ చేసి, వివాదంలో చిక్కుకున్న రణ్‌వీర్.. కర్ణాటక హైకోర్టుకు ఇచ్చిన హామీ మేరకు మైసూర్‌లోని ప్రముఖ చాముండేశ్వరి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుని, దైవానికి క్షమాపణలు చెప్పుకున్నారు.
‘IFFI 2025’ ముగింపు వేడుకలకు ‘కాంతార’ దర్శకుడు, నటుడు రిషబ్ శెట్టి కూడా హాజరయ్యారు. అయితే రిషబ్ చేసిన అత్యంత పవిత్రమైన ‘దైవ నృత్యం’ (భూత కోల) ను రణ్‌వీర్ సింగ్ స్టేజ్ పైన కాస్త అతిగా అనుకరిస్తూ మిమిక్రీ చేశారు. కేవలం అంతటితో ఆగకుండా.. తుళునాడు ప్రజలు ఎంతో పవిత్రంగా కొలిచే ఆ ‘దైవాలను’ రణ్‌వీర్ సింగ్ ‘దయ్యాలు’ గా సంబోధించారు. దీనితో కన్నడ సంస్కృతిని, ఆచారాలను రణ్‌వీర్ తీవ్రంగా అవమానించారంటూ సామాజిక మాధ్యమాల్లో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో ఈ ఘటనపై బెంగళూరుకు చెందిన ఒక న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రణ్‌వీర్‌పై ఎఫ్ఐఆర్ (FIR) నమోదైంది. ఈ కేసును కొట్టివేయాలని రణ్‌వీర్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించగా.. తాను చాముండేశ్వరి దేవిని దర్శించుకుని క్షమాపణలు కోరతానని కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన హైకోర్టు జస్టిస్ నాగప్రసన్న.. రాబోయే 4 వారాల వ్యవధిలో ఆలయాన్ని సందర్శించాలని గడువు విధించారు. కోర్టు ఆదేశించిన కొద్ది రోజుల్లోనే రణ్‌వీర్ సింగ్ తన బిజీ షెడ్యూల్స్ పక్కనబెట్టి మైసూర్ చేరుకున్నారు. చాముండేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రాయశ్చిత్తం చేసుకున్నారు.
‘ఆ సినిమాలో రిషబ్ శెట్టి కనబరిచిన అద్భుతమైన నటనను ప్రశంసించడమే నా ఉద్దేశం. ఒక నటుడిగా, ఆ నిర్దిష్టమైన సీన్‌లో అంతటి హావభావాలు పండించడానికి ఎంతటి కృషి అవసరమో నాకు తెలుసు. ఆయన నటన పట్ల నాకు ఎంతో గౌరవం ఉంది. మన దేశంలోని ఏ సంస్కృతిని, సంప్రదాయాలను లేదా నమ్మకాలను అగౌరవపరచడం నా ఉద్దేశం కాదు. నా వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే, నేను హృదయాపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను’ అని మరోసారి రణ్‌వీర్ క్లారిటీ ఇచ్చారు.
