Rashmika Mandanna: ‘రణబాలి’ ట్రైలర్ లాంచ్‌కు రష్మిక డుమ్మా.. అసలు కారణం ఇదే!

Rashmika Ranabaali Trailer Launch

Rashmika Ranabaali Trailer Launch

Why Rashmika Was Absent From Ranabaali Trailer Launch: రౌడీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా, రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ విడుదలకు సిద్ధమవుతోంది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. అక్టోబరు 16న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో గురువారం (అక్టోబర్ 8) చిత్ర బృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ సహా దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్, నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ పాల్గొన్నారు.

అయితే ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి హీరోయిన్ రష్మిక మందన్న హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి నటించిన సినిమా కావడంతో ఆమె ఎందుకు రాలేదనే ప్రశ్నలు ఎదురయ్యాయి. దీనిపై స్పందించిన విజయ్ అసలు విషయం వెల్లడించారు. రష్మికకు ఇతర సినిమాల షూటింగ్‌లు, ప్రమోషన్లతో బిజీ షెడ్యూల్ ఉండటమే కారణమని స్పష్టం చేశారు. ‘లైఫ్ అంతా ఈజీగా ఉండదు డార్లింగ్. ప్రమోషన్స్ డేట్స్ చెప్పమని రష్మిక ఎప్పటి నుంచో నన్ను అడుగుతున్నారు. కానీ నాకు రిలీజ్ డేట్ తప్ప మిగతా విషయాలపై స్పష్టత లేదు. ట్రైలర్ లాంచ్ హైదరాబాద్‌లో చేస్తామా?, అనంతపురంలో చేస్తామా?, ఏ రోజు నిర్వహిస్తాం?, అప్పటికి సీజీ పనులు పూర్తవుతాయా? అనే విషయాలపై క్లారిటీ లేదు’ అని విజయ్ వివరించారు.

‘అక్టోబరు 10 నుంచి 20 వరకు డేట్స్ ఖాళీగా పెట్టుకోవాలని రష్మికకు చెప్పాను. ఆమె కూడా ఆ తేదీలను అందుబాటులో ఉంచుకున్నారు. కానీ అనూహ్యంగా ట్రైలర్ లాంచ్‌ను ఈరోజే నిర్వహించాల్సి వచ్చింది. రష్మిక ఇప్పుడు మూడు, నాలుగు సినిమాలు చేస్తున్నారు. నిర్మాతలు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు. నటీనటులు, దర్శకుల తేదీలను సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెకు చాలా ఒత్తిడి ఉంటుంది. నాకు రౌడీ జనార్ధన సినిమా షూటింగ్ ఉంది. నిర్మాత దిల్ రాజు గారిని అడిగి ట్రైలర్ లాంచ్‌కు హాజరయ్యా. రష్మికకు బిజీ షెడ్యూల్ ఉండటంతో ఈ కార్యక్రమానికి రావడం సాధ్యపడలేదు. మన ప్లానింగ్ మొదటి నుంచే అంత పక్కాగా ఉండదు కదా’ అంటూ అని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చారు. రణబాలి ట్రైలర్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచింది. విజయ్, రష్మిక జోడీ మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది.