Ramayana: సహ నిర్మాతగా ఉన్నందుకేనా? రణబీర్‌ను డామినేట్ చేస్తున్న యశ్!

Yash

Yash

Ramayana: భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న మైథలాజికల్ మూవీ ‘రామాయణ’ ప్రమోషన్స్ కర్ణాటక ఈవెంట్‌తో ఊపందుకున్నాయి. ఈ సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన సరికొత్త ఇంటర్నేషనల్ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచడమే కాకుండా, ఊహించని సరికొత్త చర్చకు తెరలేపింది. ఈ సినిమాలో శ్రీరాముడిగా నటిస్తున్న బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ కంటే, రావణాసురుడి నెగిటివ్ షేడ్స్‌లో కనిపించబోతున్న కన్నడ రాకింగ్ స్టార్ యశ్‌కే మేకర్స్ ఎక్కువ స్పేస్, విపరీతమైన ఎలివేషన్లు ఇచ్చారన్న టాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అసలు రామాయణంలో కథ మొత్తం రాముడి చుట్టూనే తిరగాలి. కానీ ట్రైలర్‌లో మాత్రం రణబీర్ కపూర్‌ను దాటుకుని యశ్ పాత్రే ఎక్కువగా డామినేట్ చేసినట్లు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. బహుశా ఈ చిత్రానికి యశ్ స్వయంగా కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తుండటం వల్లే మేకర్స్ ఆయనకు ఇంతలా ఓవర్ ఎలివేషన్ ఇచ్చారా అన్న అనుమానాలు సినీ ప్రియుల్లో బలపడుతున్నాయి.

గతంలో ‘టాక్సిక్’ సినిమా టైంలో యశ్ చేసిన ప్రయోగాలు బెడిసికొట్టిన సంగతి తెలిసిందే. హాలీవుడ్ స్థాయి సినిమా అంటూ కన్నడతో పాటు ఇంగ్లీష్ మార్కెట్‌ను టార్గెట్ చేసి, బడ్జెట్‌ను అడ్డగోలుగా పెంచేసి కేవీఎన్‌తో కలిసి అటు హీరోగానూ, ఇటు ప్రొడ్యూసర్‌గానూ భారీగా చేతులు కాల్చుకున్నాడు. దర్శకురాలి పనిలో అతిగా జోక్యం చేసుకుని అవుట్‌పుట్‌ను మార్చేయడం వల్లే ఆ సినిమా ఆడియన్స్‌కు విసుగు తెప్పించిందనే కామెంట్స్ వినిపించాయి. ఆ చేదు అనుభవం తర్వాత ‘రామాయణ’ విషయంలో దర్శకుడు నితీష్ తివారీ, మెయిన్ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రాలు మేకింగ్ లేదా డైరెక్షన్‌లో యశ్ వేలు పెట్టే ఛాన్స్ ఇవ్వకుండా జాగ్రత్త పడ్డారని తెలుస్తోంది. అయితే స్క్రిప్ట్ మార్పులకు అవకాశం లేకపోయినా, ప్రమోషన్స్ కంటెంట్‌లో మాత్రం తన పాత్రను అత్యంత పవర్‌ఫుల్‌గా ప్రొజెక్ట్ చేయించుకోవడంలో యశ్ సక్సెస్ అయ్యాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈ రెండు భాగాల చిత్రానికి ఏకంగా రూ.4 వేల కోట్లకు పైగా బడ్జెట్ పెట్టడం, వీఎఫ్‌ఎక్స్ క్వాలిటీపై ట్రోల్స్ వస్తున్న నేపథ్యంలో యశ్ మాట్లాడుతూ విదేశాల్లో మన సినిమాకు గుర్తింపు రావాలంటే తక్కువ బడ్జెట్ అంటే ఎవరూ పట్టించుకోరని, అందుకే అంత ఖర్చు పెట్టాల్సి వచ్చిందని సమర్థించుకున్నాడు. అయితే కంటెంట్ బాగుంటే ప్రపంచవ్యాప్తంగా సినిమా ఎలా ఆడుతుందో రాజమౌళి నిరూపించిన విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాలని విశ్లేషకులు అంటున్నారు. ఏదేమైనా, టైటిల్ పాత్ర పోషిస్తున్న రణబీర్‌ను పక్కనపెట్టి కేవలం విలన్ రోల్‌ను మాత్రమే ఇంతగా గ్లోరిఫై చేయడం రేపు థియేటర్లలో ఏ స్థాయి ఫలితాన్ని ఇస్తుందో వేచి చూడాలి.