Ramayana: ‘రామాయణ’కు హైప్ కోసం కొత్త స్ట్రాటజీ.. ఏకంగా ఫైవ్ స్టార్ రేటింగ్స్!

Ramayana Movie Hype

Ramayana Movie Hype

Ramayana: భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘రామాయణ’ చిత్రం చుట్టూ ఇండస్ట్రీలో ఇప్పుడు సరికొత్త చర్చ మొదలైంది. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి జంటగా నితీశ్ తివారి దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా, యశ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒక్కో పార్ట్‌పై సుమారు రూ. 2 వేల కోట్లు ఖర్చు పెడుతున్నట్లు చిత్ర బృందం చెబుతున్నప్పటికీ, సినిమా ప్రమోషనల్ కంటెంట్ మాత్రం ఆశించిన స్థాయిలో బజ్ తీసుకురాలేకపోయింది. గ్లింప్స్, టీజర్, ట్రైలర్, పాటలు ఏవీ ప్రేక్షకుల్లో పూర్తిస్థాయి ఉత్సాహాన్ని నింపలేకపోయాయి.

రాముడి పాత్రలో రణ్‌బీర్ లుక్స్‌పై పెదవి విరుపులు, సీత పాత్రకు సాయి పల్లవి సరిపోలేదంటూ వచ్చిన కామెంట్లు, ఏఆర్ రెహమాన్ ట్యూన్స్‌పై వచ్చిన కాపీ ఆరోపణలు సినిమాపై ముందునుంచే నెగెటివ్ ప్రభావాన్ని చూపించాయి. వీటికి తోడు, ఇటీవల లాస్ ఏంజెల్స్‌లో వేసిన ప్రత్యేక షోకు సైతం డివైడ్ టాక్ రావడం చిత్ర బృందానికి పెద్ద తలనొప్పిగా మారింది. మార్కెట్‌లో సరైన క్రేజ్ లేకపోవడం, విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు మేకర్స్ ఒక వినూత్న ఎత్తుగడ వేశారు. ఎలాగైనా సినిమాపై హైప్ పెంచాలనే ఉద్దేశంతో మేకర్స్ ఒక అనూహ్య ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. థియేటర్లలో విడుదలకు ఐదు రోజుల ముందే కొంతమంది ఎంపిక చేసిన బాలీవుడ్ సెలబ్రిటీ రివ్యూవర్లకు ప్రత్యేకంగా సినిమాను చూపించారు. అయితే, ఆ రివ్యూ రైటర్లు ఏకంగా ‘ఐదుకు ఐదు’ (5/5) ఫైవ్ స్టార్ రేటింగ్‌లు ఇస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం సినీ వర్గాలను విస్తుపోయేలా చేసింది.

టీజర్లు, ట్రైలర్లు, పాటల్లో ఏ ఒక్కటీ ప్రేక్షకులను మెప్పించలేకపోయినప్పుడు.. రివ్యూవర్లకు మాత్రం ఏకంగా ఫైవ్ స్టార్ ఇచ్చేంతగా సినిమా ఎలా నచ్చిందంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నెలకొన్న నెగెటివ్ టాక్‌ను కవర్ చేసి, ఆడియన్స్‌లో కృత్రిమంగా హైప్ క్రియేట్ చేయడానికే మేకర్స్ ఇలాంటి రేటింగ్స్ వేయించారా? లేక విజువల్స్ నిజంగానే అంత అద్భుతాన్ని సృష్టించాయా? అన్నది పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎంత బాగున్నా ఒక సినిమాకు ఏకపక్షంగా 5/5 రేటింగ్ ఇవ్వడం వెనుక అసలు ప్లాన్ ఏంటో తేలాలంటే సాధారణ ప్రేక్షకులు సినిమా చూసే వరకు ఆగాల్సిందే.