RC 17: కొత్త ప్రపంచాన్ని సుకుమార్ సృష్టిస్తాడా?

Ram Charan Rc17 (2)

Ram Charan Rc17 (2)

ఒకప్పుడు ‘రంగస్థలం’తో బాక్సాఫీస్ దగ్గర హిస్టరీ క్రియేట్ చేసిన కాంబినేషన్ ఇప్పుడు మరోసారి సిద్ధమైంది. ‘పుష్ప 2’ తర్వాత సుకుమార్, ‘పెద్ది’ తర్వాత రామ్‌చరణ్.. ఈ ఇద్దరి కలయికలో రాబోతున్న ‘RC 17’ (ఆర్సీ 17) పై అప్పుడే భారీ అంచనాలు మొదలైపోయాయి. అయితే, ‘రంగస్థలం’ని మించిన సంచలనం సృష్టించాల్సిన బాధ్యత ఈ కాంబినేషన్ మీదే ఉంది. మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఆర్సీ 17’ ప్రాజెక్ట్ ఎట్టకేలకు పట్టాలెక్కింది. నవంబర్ 1న హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో సంప్రదాయ పూజా కార్యక్రమాలతో సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై తొలి క్లాప్ ఇచ్చారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్టుకు సుకుమార్ రైటింగ్స్, టీ సిరీస్ కూడా భాగస్వాములుగా ఉన్నాయి. అయితే, సినిమా స్టార్ట్ అయిన రోజే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మరి ఈ అంచనాలకు తగ్గట్టుగా సినిమా రూపుదిద్దుకుంటుందా అన్నదే అసలు ప్రశ్న. ‘ఆర్సీ 17’ లాంచ్‌తోనే మరోసారి ‘రంగస్థలం’ జ్ఞాపకాలు తెరపైకి వస్తున్నాయి. అప్పట్లో ‘చిట్టిబాబు’ పాత్రతో చరణ్ నటుడిగా తన స్థాయిని పెంచుకుంటే, సుకుమార్ కూడా దర్శకుడిగా తన మార్క్‌ను చూపించారు. ఇప్పుడు వీరిద్దరి కెరీర్‌లు మరింత హై రేంజ్‌కి చేరుకున్నాయి. అందుకే, ఈసారి వచ్చే సినిమా కూడా అదే స్థాయిలో ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. కానీ, ఇక్కడే అసలు చిక్కుంది. స్టోరీ ఎలా ఉంటుంది, క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఇంకా సస్పెన్స్‌గానే ఉంచారు మేకర్స్. గత సినిమాతో పోలికలు మొదలైతే, కొత్త కథకు స్వతంత్రంగా గుర్తింపు తెచ్చుకోవడం కష్టమే. మరి ఈసారి ‘రంగస్థలం’ ఫార్ములా కాకుండా, మరో కొత్త ప్రపంచాన్ని సుకుమార్ సృష్టిస్తాడా?

‘పుష్ప 2’తో దేశవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకున్న సుకుమార్‌కు ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్‌లో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. కానీ, ఒక సినిమా విజయం తర్వాత వచ్చే మరో సినిమాపై అంచనాలు రెట్టింపవుతాయి. ‘పుష్ప’ తరహా ఎలివేషన్స్, రా అండ్ రగ్గడ్ మేకింగ్, భారీ యాక్షన్‌తోనే మరోసారి ప్రేక్షకులను మెప్పించడం సాధ్యం కాదు. పైగా ‘రంగస్థలం’ తర్వాత చరణ్‌తో చేస్తున్న సినిమా కావడంతో, కథలోనూ, పాత్రలోనూ కొత్తదనం తప్పనిసరి. తన గత విజయాల ప్రభావం నుంచి బయటపడి సుకుమార్ మరో కొత్త కథను ఆవిష్కరించగలిగితేనే ‘ఆర్సీ 17’ బాక్సాఫీస్‌ను బద్దలు కొడుతుంది. ‘ఆర్సీ 17’ కోసం రామ్‌చరణ్ బరువు తగ్గి, లాంగ్ హెయిర్‌తో రగ్గడ్ అండ్ స్టైలిష్ అవతార్‌లో కనిపించేందుకు లుక్ టెస్ట్‌లు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు సుకుమార్ సినిమాలకు రెగ్యులర్‌గా సంగీతం అందించే దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో అనిరుధ్ రవిచందర్ చేస్తాడని టాక్ వినిపిస్తోంది. మేకర్స్ ఈ విషయం మీద క్లారిటీ ఇవ్వలేదు. ఇక హీరోయిన్‌గా సారా అర్జున్, అనిత్ పెద్ద, సాత్వికా వీరవల్లి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఫైనల్‌గా ఎవరు హీరోయిన్ అనేది సస్పెన్స్ వీడలేదు. ఇన్ని సస్పెన్స్‌ల మధ్య ఎర్లీ 2027లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి, 2027 ఎండ్ కల్లా కంప్లీట్ చేసి, 2028లో ఈ సినిమాను రిలీజ్ చేయాలనే టార్గెట్‌తో టీం ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. మరి సుకుమార్ టీం టార్గెట్ రీచ్ అవుతుందా? బలమైన కథ లేకపోతే అవే భారంగా మారే ప్రమాదం ఉంది. ‘ఆర్ఆర్ఆర్’ (RRR) తో చెర్రీ, ‘పుష్ప’తో సుకుమార్ పాన్ ఇండియా స్థాయికి వెళ్ళారు. ఇప్పుడు ఈ ఇద్దరి ఇమేజ్‌లను దాటి ‘ఆర్సీ 17’ కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేస్తుందా లేదా చూడాలి.