గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ (PEDDI). మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పాన్-ఇండియా చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం బెంగళూరులో చిత్రబృందం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో రామ్ చరణ్, కన్నడ సూపర్‌స్టార్ శివ రాజ్‌కుమార్, జాన్వీ కపూర్, నిర్మాత వెంకట సతీశ్ కిలారు పాల్గొన్నారు. ఈ ప్రమోషనల్ ఈవెంట్‌లో రామ్ చరణ్, శివన్న పంచుకున్న ఆసక్తికరమైన విశేషాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
శివ రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. ‘నా జీవితంలో నేను చేసిన అత్యంత స్ఫూర్తిదాయకమైన సినిమా ‘పెద్ది’. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత మళ్లీ సినిమాతో మీ ముందుకు వస్తున్నా. నేనెప్పుడూ నా మనసుకు దగ్గరైన పాత్రలే చేస్తా. ఈ సినిమాలో నాది ఒక కోచ్ తరహా పాత్ర. నా పాత్రకు ఒక బలమైన లక్ష్యం ఉంటుంది. ‘పెద్ది’ కథలో ఎన్నో రకాల ఆటలున్నా.. దేనికదే బలమైన ముద్ర వేస్తుంది. పెద్దికి.. నాకు మధ్య ఉండే లవ్, అఫెక్షన్, ఎమోషన్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఇక ఈ సినిమాలో నటనకు గానూ రామ్ చరణ్‌కు ఖచ్చితంగా నేషనల్ అవార్డు (National Award) వస్తుందని నమ్ముతున్నా. ఈ పాత్ర కోసం ఆయన రెండేళ్ల పాటు ఎంతో అంకితభావంతో పని చేశారు. బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్ చేసుకున్న తీరు, ఒదిగిపోయిన విధానం అద్భుతం. బుచ్చిబాబు కథకు ఏం కావాలో అదే తీశారు. ముఖ్యంగా సినిమాలోని ‘సర్ప్రైజింగ్ క్లైమాక్స్’ను థియేటర్లలోనే చూసి ఆస్వాదించాలి. మంచి కథలొస్తే తెలుగులో వరుసగా సినిమాలు చేస్తా. ప్రస్తుతం తెలుగులో విప్లవ వీరుడు ‘గుమ్మడి నర్సయ్య’ బయోపిక్‌తో పాటు రజనీకాంత్‌తో ‘జైలర్ 2’ లో నటిస్తున్నాను’ అని శివన్న చెప్పుకొచ్చారు.
