దర్శకుడు బుచ్చిబాబు ప్రతిభను చరణ్ ఆకాశానికెత్తారు. ప్రీ రిలేజ్ ఈవెంట్లో మాట్లాడిన రామ్ చరణ్ “ఈ కథ విన్నాక అసలు బుచ్చిబాబు బుర్ర ఎలా పనిచేస్తుందిరా బాబు అని ఆశ్చర్యపోయాను. రాసి పెట్టుకోండి.. భవిష్యత్తులో భారతదేశంలోనే టాప్ 3 లేదా టాప్ 4 దర్శకుల జాబితాలో బుచ్చిబాబు పేరు ఖచ్చితంగా ఉంటుంది” అని బల్లగుద్ది మరీ చెప్పారు. తనకు ఇంతటి వెన్నుముకగా నిలుస్తున్న అభిమానుల గురించే చరణ్ అత్యంత ఎమోషనల్ వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి విభిన్నమైన సినిమా ఒప్పుకోవడానికి తన మనసులోని ఏకైక బలం అభిమానుల ప్రేమేనన్నారు. “మీ కోసమే ఈ సినిమా చేశాను.
మీ ఆనందం కోసం చేతులు విరగ్గొట్టుకోవడమే కాదు, రక్తం చిందించడానికైనా నేను వెనకాడను. మా నాన్నగారి (చిరంజీవి) కొడుకుగా పుట్టడం, కళ్యాణ్ బాబాయ్ (పవన్ కళ్యాణ్) ఇంట్లో పెరగడం వల్ల కష్టపడటం, సినిమాలు చేయడం తప్ప నాకు ఇంకేమీ తెలియదు. బహుశా వేరే పనులేవైనా తెలిసి ఉంటే నేనింత పెద్ద నటుడిని అయ్యేవాడినేమో కాదేమో! నాకు తెలిసింది ఒకే ఒక్కటి.. అదే సినిమా. నేను చనిపోయే వరకు మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంటాను.. ఇది రాసి పెట్టుకోండి” అంటూ చరణ్ తన ప్రసంగాన్ని ముగించారు. రామ్ చరణ్ ఎనర్జీ, సినిమాపై ఆయనకున్న నమ్మకం చూస్తుంటే జూన్ 4న థియేటర్లలో ‘పెద్ది’ సృష్టించబోయే బాక్సాఫీస్ సునామీ ఎలా ఉండబోతుందో అర్థమవుతోంది!
