ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ ‘పుష్ప 2: ది రూల్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తోందో అందరికీ తెలిసిందే. అయితే, ఈ భారీ విజయం వెనుక కొందరు స్టార్ నటుల్లో తీవ్ర అసంతృప్తి దాగుందనే విషయం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయింది. సినిమాలో తమ పాత్రలను డిజైన్ చేసిన విధానంపై, స్క్రీన్ టైమ్‌పై ఒక హీరో,ఒక సీనియర్ హీరో బహిరంగంగానే పెదవి విరవడం సంచలనం రేపుతోంది. సినిమాలో మెయిన్ విలన్‌గా నటించిన మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ (భన్వర్ సింగ్ షెకావత్) ఇప్పటికే తన పాత్ర నిడివిపై అసంతృప్తి వ్యక్తం చేయగా… ఇప్పుడు అదే లిస్టులోకి టాలీవుడ్ సీనియర్ హీరో, వర్సటైల్ యాక్టర్ జగపతి బాబు కూడా చేరారు. థియేటర్లలో కనిపించిన తమ పాత్రల అవుట్‌పుట్ చూసి ఇద్దరూ తీవ్ర నిరాశకు గురైనట్లు తెలుస్తోంది.
సినిమా నిడివి ఇప్పటికే 3 గంటల 21 నిమిషాలు ఉన్నప్పటికీ తమకు సంబంధించిన ఎన్నో కీలక సీన్లను ఎడిటింగ్‌లో లేపేశారని వారు అసహనం వ్యక్తం చేశారు. దీంతో అసలు సుకుమార్ ఈ సినిమా కోసం ఇంకెంత ఫుటేజ్ షూట్ చేసి ఉంటారనేది ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇంత పెద్ద నటులను పెట్టుకుని, వారి సీన్లు ట్రిమ్ చేయడం హాట్ టాపిక్ అయింది. ఇదే తరుణంలో జగపతి బాబు ‘పుష్ప’ ఫ్రాంచైజీకి సంబంధించి ఒక ఆసక్తికరమైన నిజాన్ని బయటపెట్టారు. నిజానికి సుకుమార్ ‘పుష్ప పార్ట్ 2’, ‘పుష్ప పార్ట్ 3’లను విడివిడిగా కాకుండా… ఒకే ఒక సినిమాగా ముగించాలని మొదట ప్లాన్ చేశారట. కానీ, ఫుటేజ్ భారీగా పేరుకుపోవడంతో దాన్ని రెండు భాగాలుగా మార్చాల్సి వచ్చినట్లు ఆయన హింట్ ఇచ్చారు. సుకుమార్ పర్ఫెక్షన్ కోసం ఎంతటి స్టార్ నటుల సీన్లనైనా నిర్దాక్షిణ్యంగా పక్కన పెడతారని మరోసారి ప్రూవ్ అయింది. మరి ఈ ఎడిటింగ్ వివాదాలు ‘పుష్ప 3’పై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో చూడాలి!
