ఎంటర్టైన్మెంట్ అందించే చిత్రాలకు ప్రేక్షకుల్లో ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. ముఖ్యంగా కామెడీ బేస్డ్ చిత్రాలకు ఎలాంటి లాజిక్ అవసరం లేకుండానే ప్రేక్షకులు పట్టం కడతారు. అందుకే స్టార్ హీరోలు సైతం వినోదాత్మక కథలను ఎంచుకోవడానికి ఇష్టపడతారు. ఆడియెన్స్ థియేటర్‌కు వచ్చేది రిలాక్స్ అవ్వడానికి, వినోదం పొందడానికే కాబట్టి, వారు ఎక్కువగా వినోదభరితమైన కథలకే మొగ్గు చూపుతారు. ఈ కోవలోనే, అందరినీ నవ్వించేందుకు ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ‘పురుష:’ టీం సిద్ధమవుతోంది.
ఇప్పటి వరకు ‘పురుష:’ టీం విడుదల చేసిన పోస్టర్లు, క్యాప్షన్స్, పెళ్లి, ఆడ, మగ, స్వేచ్ఛ వంటి అంశాల చుట్టూ ఉన్న పాయింట్స్ చూస్తుంటే… ఈ సినిమా ఆద్యంతం నవ్వించే కథాంశంతో రూపొందుతున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా విడుదల చేసిన మరో పోస్టర్ ఈ చిత్రంపై అంచనాలను మరింత పెంచింది. ముఖ్యంగా, పోస్టర్‌పై రాసిన “మగాళ్లను మొక్కు కుంటూ కాదు… తొక్కు కుంటూ పోతం” అనే బోల్డ్ లైన్ సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తించింది. ఈ తరహా ఆసక్తికరమైన పోస్టర్లను సినిమా విడుదల వరకు మరిన్ని వదలాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. బత్తుల సరస్వతి సమర్పణలో, కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల కోటేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రం ‘పురుష:’.
ఈ సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి వీరు వులవల దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్‌తో పాటుగా, ఈ చిత్రంలో కసిరెడ్డి, సప్తగిరి పాత్రలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని తెలుస్తోంది. వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు. అలాగే, వెన్నెల కిషోర్, వి.టి.వి. గణేష్, అనంత శ్రీరామ్, పమ్మి సాయి, మిర్చి కిరణ్ వంటి ప్రముఖ కమెడియన్స్ అందరినీ కడుపుబ్బా నవ్విస్తారని చిత్ర బృందం నమ్మకంగా చెబుతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీని ప్రకటించడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.