పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి కలయికలో రూపొందుతున్న భారీ పీరియాడిక్ వార్ డ్రామా ‘ఫౌజీ’ (#Fauzi). శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి తాజాగా విడుదలైన సరికొత్త పోస్టర్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ఇప్పటివరకు చూడని అత్యంత ఇంటెన్స్, ఊరమాస్ అవతారంలో ప్రభాస్ దర్శనమిచ్చి అభిమానులను ఉర్రూతలూగిస్తున్నారు. ఇండిపెండెన్స్ డే సంధర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో నెత్తుటి మరకలు అంటిన ఒంటితో, చేతిలో పవర్‌ఫుల్ తుపాకులు పట్టుకుని పూర్తి రౌద్ర రూపంలో ప్రభాస్ కనిపిస్తున్నారు. ఆయన కళ్లలోని ఆగ్రహం, ఇంటెన్సిటీ యాక్షన్ ప్రియులకు పిచ్చెక్కిస్తోంది పోస్టర్ బ్యాక్‌గ్రౌండ్‌లో హైదరాబాద్ చారిత్రక కట్టడం చార్మినార్ మంటల్లో కాలిపోతున్న దృశ్యం చూపించడం కథలోని తీవ్రతను, ఉద్రిక్తతను చాటిచెబుతోంది.
బ్యాక్‌గ్రౌండ్‌లో గాంధీజీ వేషధారణలోని ఛాయలు కనిపిస్తుండగా.. “A BATTALION WHO FIGHTS ALONE” (ఒంటరిగా పోరాడే ఒక సైన్యం) అంటూ ఇచ్చిన క్యాప్షన్ కథపై భారీ అంచనాలు పెంచుతోంది. భారత స్వాతంత్య్ర సంగ్రామ కాలం నాటి నేపథ్యంలో సాగే ఈ కథలో ప్రభాస్ ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ సైనికుడి పాత్రలో కనిపించబోతున్నారనే ప్రచారం ఎప్పటినుంచో సాగుతోంది. తాజా పోస్టర్‌లో చూపించిన చార్మినార్ విధ్వంసం, దేశభక్తి ఎలివేషన్స్ చూస్తుంటే బ్రిటీష్ కాలం నాటి నిజాం పాలన, తెలంగాణ పోరాటాల చుట్టూ కథనం అల్లినట్లు స్పష్టమవుతోంది. ఎందుకంటే గాంధేయ వాదం కాదని ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపించిన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. తాజా పోస్టర్‌తో ‘ఫౌజీ’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను తిరగరాయడం ఖాయమని స్పష్టమవుతోంది.

