Vihari: ఓటీటీలోకి దిగ్గజ ట్రావెల్ షో.. సరికొత్త రికార్డులకు తెరతీస్తున్న విహారి!

Vihari

Vihari

తెలుగు టెలివిజన్ చరిత్రలో ఒక అరుదైన మైలురాయిగా నిలిచిన ప్రముఖ ట్రావెల్ షో ‘విహారి’ ఇప్పుడు సరికొత్త రూపంలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. గత 18 ఏళ్లుగా ప్రయాణ ప్రియులను విదేశాలు, దేశంలోని అద్భుతమైన ప్రదేశాలకు తీసుకెళ్తూ అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్న ఈ షో.. ఇప్పుడు సరికొత్త ఓటీటీ యాప్‌గా మారబోతోంది. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో అత్యంత వైభవంగా ఈ ఓటీటీ యాప్ ప్రోమో లాంచ్ వేడుక ఘనంగా జరిగింది. 2004లో ‘మా టీవీ’లో చిన్న ప్రయత్నంగా ప్రారంభమైన ‘విహారి’ ద ట్రావెలర్.. ఎన్నో మైలురాళ్లను అధిగమిస్తూ నేడు ఓటీటీ స్థాయికి ఎదిగింది. వ్యవస్థాపకులు, దర్శకులు ఏ.ఎల్. నితిన్ ఈ వినూత్న యాప్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సర్వం సిద్ధం చేశారు. అప్పట్లో కరుణ, స్నిగ్ధ లాంటి ప్రముఖ యాంకర్లతో కలర్‌ఫుల్ ఎపిసోడ్స్ అందించిన విహారి.. ఇప్పుడు మరింత అప్‌గ్రేడ్ అయింది. ఈ నవంబర్ నుంచి బుల్లితెర లెజెండ్రీ యాంకర్ సుమతో కలిసి సరికొత్త, ఇన్నోవేటివ్ ఎపిసోడ్స్‌ను టెలికాస్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇక ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు గ్లామర్ అండ్ ఎనర్జిటిక్ టచ్ ఇస్తూ ప్రముఖ నటి, యాంకర్ శ్రీ సత్యను ఓటీటీ హోస్ట్‌గా ఎంపిక చేయడం విశేషం. ఈ వేడుకకు సదరన్ ట్రావెల్స్ ప్రవీణ్, వజ్ర కన్స్ట్రక్షన్స్ అధినేతలు రాజు, శ్వేతలతో పాటు యాంకర్ శ్రీ సత్య ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా వ్యవస్థాపకుడు ఏ.ఎల్. నితిన్ మాట్లాడుతూ.. ప్రయాణాలను ఇష్టపడే ప్రతి ఒక్కరికీ ఈ ఓటీటీ యాప్ ఒక పూర్తిస్థాయి గైడ్‌లా ఉంటుందని, నవంబర్‌లో ఈ యాప్ అధికారికంగా లాంచ్ కానుందని వెల్లడించారు. తక్కువ బడ్జెట్‌లో ఎక్కడ బెస్ట్ హోటల్స్ ఉంటాయి, ఎలాంటి ఫుడ్ దొరుకుతుంది అనే పూర్తి వివరాలతో సాగే ఈ ప్రయాణం ఓటీటీ ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని పంచుతుందని నిర్వాహకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.