వచ్చే యేడాది సంక్రాంతి బరిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రిన్స్ మహేశ్ బాబు పోటీ పడబోతున్నారు. టాలీవుడ్ టాప్ స్టార్స్ మూవీస్ విడుదల తేదీలను వరుసగా ప్రకటిస్తున్న సమయంలో మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని 2022 సంక్రాంతికి విడుదల చేయబోతున్నామని ఈ యేడాది జనవరి 29న నిర్మాతలు ప్రకటించారు. అయితే ఆ తర్వాత కరోనా కారణంగా సినిమా షూటింగ్ షెడ్యూల్స్ అటూ ఇటూ అయినా… చేతిలో చాలా సమయమే ఉంది కాబట్టి… సంక్రాంతికే ‘సర్కారు వారి పాట’ వస్తుందని అందరూ భావిస్తున్నారు. ఇదిలా ఉంటే… మార్చి 11వ తేదీన పవన్ కళ్యాణ్ – క్రిష్ చిత్రానికి ‘హరిహర వీరమల్లు’ అనే పేరును ఖరారు చేస్తూ, 2022 సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్టు నిర్మాత ఎ. ఎం. రత్నం ప్రకటించారు. దాంతో ఇటు పవన్ ఫ్యాన్స్, అటు మహేశ్ బాబు ఫ్యాన్స్ సంక్రాంతికి తమ హీరోల నడుమ పోటీ అనివార్యం అని భావించారు. అయితే తాజాగా జూలై 27న పవన్ కళ్యాణ్ – రానా ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్ ను ఈ చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ 2022 సంక్రాంతి కానుకగా విడుదల చేస్తామని తెలిపారు. పవన్ కళ్యాణ్ రెండు సినిమాలూ ఒకే సీజన్ లో అయితే రావు. కాబట్టి పవన్ పర్మిషన్ తీసుకునే ఈ తాజా చిత్రం విడుదల తేదీని నాగవంశీ ప్రకటించారని అనుకోవాలి. ఆ లెక్కన ‘హరిహర వీరమల్లు’ కాస్తంత ముందుకో వెనక్కో వెళ్ళక తప్పదు. అది ముందుకొచ్చే లెక్కైతే… అతి త్వరలోనే నిర్మాత ఎ. ఎం. రత్నం ఆ తేదీని ప్రకటించే ఆస్కారం ఉంది. అలా చూసుకున్నప్పుడు సంక్రాంతి బరిలో పోటీ పడేది మహేశ్ – పవన్ అనేది ఖాయం… కాకపోతే పవన్ సినిమానే మారింది.
Read Also : “తిమ్మరుసు” ప్రీరిలీజ్ ఈవెంట్ లో నాని… ఇన్ డైరెక్ట్ కౌంటర్ ఎవరికంటే?
ఇక సంక్రాంతి బరిలో పవన్, మహేశ్ తలపడబోతున్నారు అనగానే గతంలో వారిద్దరి సినిమాలు ఒకేసారి ఈ పండగకు ఏవైనా వచ్చాయా అనే ప్రశ్న ఉదయించడం సహజం. నిజానికి పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు ఇద్దరూ ఇంతవరకూ సంక్రాంతి సీజన్ లో పోటీ పడలేదు. అయితే… వివిధ సందర్భాలలో ఒక వారం, రెండు వారాల గ్యాప్ తో పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు సినిమాలు పోటీ పడిన సంఘటనలు లేకపోలేదు. బాలనటుడిగా సూపర్ క్రేజ్ సంపాదించుకున్న మహేశ్ బాబు హీరోగా నటించిన తొలి చిత్రం ‘రాజకుమారుడు’. ఇది పవన్ కళ్యాణ్ ‘తమ్ముడు’ మూవీతో పోటీ పడింది. 1999 జూలై 15వ తేదీ ‘తమ్ముడు’ మూవీ విడుదలైతే అదే నెల 30న మహేశ్ బాబు ‘రాజకుమారుడు’ రిలీజ్ అయ్యింది. అలానే ఆ తర్వాత సంవత్సరం మహేశ్ బాబు హీరోగా నటించిన రెండో సినిమా ‘యువరాజు’ ఏప్రిల్ 14న రిలీజ్ అయితే, ఆ తర్వాత వారమే ఏప్రిల్ 20న పవన్ కళ్యాణ్ ‘బద్రి’ వచ్చింది. ఇక ముచ్చటగా మూడోసారి వీరి సినిమాలు 2006లో పోటీ పడ్డాయి. ఆ యేడాది ఏప్రిల్ 28న మహేశ్ బాబు ‘పోకిరి’ విడుదల కాగా, ఐదు రోజులకు మే 3న పవన్ కళ్యాణ్ ‘బంగారం’ మూవీ రిలీజ్ అయ్యింది. మరి నాలుగో సారి వచ్చే సంక్రాంతికి పోటీ పడుతున్న వీరిద్దరిలో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.