O Torture Prema : హీరోగా మాదాల రంగారావు మనవడి ఎంట్రీ?

O Torture Prema

O Torture Prema

టాలీవుడ్‌లోకి మరో సినీ వారసుడు అడుగుపెడుతున్నాడు. సీనియర్ నటుడు, విప్లవ చిత్రాల కథానాయకుడు దివంగత మాదాల రంగారావు మనవడు, నటుడు మాదాల రవి తనయుడు సన్నీ మాదాల హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘ఓ టార్చర్ ప్రేమ’. శ్రీకరం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శ్రీకర్ కృష్ణ స్వయంగా రచన, దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్న ఈ సినిమాలో మౌనిక వీర్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా డిసెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ చిత్రం టీజర్ లాంచ్ ఈవెంట్ తాజాగా హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. వేడుకలో దర్శకనిర్మాత శ్రీకర్ కృష్ణ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆకట్టుకున్నాయి. “మేమంతా కొత్తవాళ్లం కలిసి ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాం. మాకు ఇండస్ట్రీలో ఎవరి సపోర్ట్ లేదు, అయినా మేము బాధపడటం లేదు. ఒక మంచి సినిమా తీసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామనే గర్వం ఉంది. మా కంటెంట్ నచ్చి టీ-సిరీస్ లాంటి పెద్ద సంస్థ పాటల్ని, మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ సినిమాను రిలీజ్ చేస్తోంది. ఎలాంటి వల్గారిటీ లేని స్వచ్ఛమైన ప్రేమకథ ఇది. అందరూ ఎంజాయ్ చేసే కామెడీ ఇందులో ఉంటుంది” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

హీరో సన్నీ మాదాల మాట్లాడుతూ.. “ఈ సినిమాకు వచ్చే క్రెడిట్ అంతా మా డైరెక్టర్, ప్రొడ్యూసర్ శ్రీకర్ కృష్ణకే దక్కాలి. ఈ చిత్రానికి సంబంధించిన టార్చర్ ఏదైనా ఉంటే ఆయనే తీసుకున్నారు, ప్రేమను మాత్రం మాకు పంచారు! మా టెక్నీషియన్స్ అంతా సినిమాకు పెద్ద బలంగా నిలిచారు. తొలి చిత్రమైనా మౌనిక ఎంతో కాన్ఫిడెంట్‌గా నటించింది. నా ఫ్యామిలీ సపోర్ట్‌తో ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా పూర్తి చేశాను. ప్రతి ఒక్కరినీ కచ్చితంగా ఎంటర్‌టైన్ చేస్తుంది” అన్నాడు. హీరోయిన్ మౌనిక వీర్ తన జర్నీని గుర్తుచేసుకుంటూ కాస్త ఎమోషనల్ అయింది. “ఇందులో నేను ‘మానస’ అనే పాత్రలో కనిపిస్తాను. ఇలాంటి వేదికపై నిల్చొని మాట్లాడే అవకాశం రావడానికి నాకు ఆరేళ్లు పట్టింది. ఈ సినిమాతో ఎంతోమంది మంచి స్నేహితులు దొరికారు. టీమ్ మొత్తాన్ని శ్రీకర్ కృష్ణ ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుంది” అని చెప్పింది. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, శ్రీనివాస్, శ్రీవాణి, జబర్దస్త్ రోహిణి, నాగి, సిద్ధార్థ్ వర్మ, విష్ణు ప్రియ, యాదమ్మ రాజు తదితరులు కీలక పాత్రలు పోషించారు. కొత్తవాళ్ల ప్రయత్నానికి అగ్ర సంస్థల తోడ్పాటు తోడవడంతో, డిసెంబర్ 11న థియేటర్లలోకి వస్తున్న ‘ఓ టార్చర్ ప్రేమ’పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.