తూర్పు – పడమర ఎదురెదురు – అవి కలవని దిక్కులు అంటారు. అయితే ప్రపంచీకరణ ఆ హద్దులు చెరిపేస్తోంది. ఈ నేపథ్యంలో ముందుగా పాశ్చాత్య దేశాల వారు హద్దులు చేరిపేయడానికి సిద్ధమయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను అలరించాలంటే, వారి సంప్రదాయ రీతులకు తగ్గ కథలను తమ బాణీలో పలికించాలని పశ్చిమ దేశాలలోని సినిమా రంగాలు భావించాయి. సదా అందరి కన్నా ముందుంటాము అని చాటింపు వేసుకొనే హాలీవుడ్ ఈ విషయంలో నిజంగానే ముందే ఉంది. తమకున్న ఎస్సెట్ మోడరన్ టెక్నాలజీ. దానికి అనువుగా తూర్పు దేశాల కథలను మిళితం చేయాలని ముందుగానే ఊహించింది. జేమ్స్ కామెరాన్ తెరకెక్కించిన ‘అవతార్’ సినిమా అందులో భాగంగా రూపొందిందనే చెప్పవచ్చు. ఇక మొత్తం సాంకేతికతతోనే సాగిన ‘ఎవేంజర్స్: ది ఎండ్ గేమ్’లోని కథ, కథనం పరీక్షగా చూసినా, అందులోనూ జపాన్, చైనా, భారతీయ కథలు కనిపిస్తాయి. ఇక ‘అవతార్’ అయితే మన భారతీయ ఇతిహాసాలనే గుర్తుచేస్తుంది. ఇక జేమ్స్ కామెరాన్ ‘టైటానిక్’ పేరుకు టైటానిక్ షిప్ చుట్టూ కథ సాగినా, అందులోని ప్రేమకథ మన ఇండియన్ లవ్ స్టోరీస్ ను పోలి ఉంటుంది. వీరందరికన్నా ముందుగానే స్టీవెన్ స్పీల్ బెర్గ్, అతని మిత్రుడు జార్జ్ లూకాస్ తూర్పు దేశాల కథలకు టెక్నాలజీ నగిషీలుచెక్కి, ‘జురాసిక్ పార్క్’, ‘స్టార్ వార్స్’ వంటి టెక్నికల్ వండర్స్ మనకు అందించారు.
ప్రస్తుతం పాశ్చాత్య దేశాలవారు మన ఆశియా ఖండం వైపు చూస్తున్నారు. ముఖ్యంగా భారతీయ సంస్కృతీ సంప్రదాయాల మాటున దాగిన రహస్యాలు వెలికి తీసి, అందుకు అనువుగా కథలు రూపొందిస్తున్నారు. ఇటీవల వెలుగు చూసిన ‘డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ద మల్టీవర్స్ మ్యాడ్ నెస్’ సినిమాను పరికించి చూస్తే, మన భారతీయ పురాణగాథల్లోని ఏడేడు లోకాలు, పంచభౌతిక శరీరాలు అన్న కాన్సెప్ట్ కనిపించకమానదు. ఇలా పాశ్చాత్య దేశాల వారు మన కథలను తమ టెక్నాలజీతో జోడించి, దూసుకు పోతున్నారు. ఈ నేపథ్యంలో భారతీయులు తమ సినిమాలకు పాశ్చాత్య పోకడలు గల మన కథల్లోని మూలాలను వెలికి తీసి, తద్వారా కథలు రూపొందించుకుంటే మంచిదని కొందరు చెబుతున్నారు. బౌద్ధకథలకు హాలీవుడ్ రంగులు అద్ది విజయం సాధించిన ‘ద క్లౌడ్ అట్లాస్’ చిత్ర రూపశిల్పులు లానా వచోవ్స్కీ, లిలీ వచోవ్స్కీ, టామ్ టైక్వర్ చెబుతున్నారు. బైబిల్ కథలను ఆధారం చేసుకొని, వాటికి భారతీయత పులిమి సినిమాలు తెరకెక్కించినా రెండు వైపుల వారినీ ఆకర్షించవచ్చునని కొందరి మాట! ఇలా గతంలోనూ కొందరు చిత్రాలను రూపొందించారు. అంతెందుకు మన తెలుగు పౌరాణిక చిత్రం ‘నర్తనశాల’లో ఓ సన్నివేశంలో ఇద్దరు తల్లులు ఒక బిడ్డ కోసం పోట్లాడుకోవడం, విరాటరాజు కొలువులో భట్టు రూపంలో ఉన్న ధర్మరాజు ఆ బిడ్డను చెరిసగం నరికి ఇవ్వండి అంటూ తీర్పు చెప్పడం, చివరకు అసలు తల్లి, ఆ బిడ్డను వేరే ఆవిడకే ఇవ్వమని చెప్పడం చూశాము. నిజానికి ఇది భారతంలోని కథ కాదు. బైబిల్ లో కింగ్ సోలమోన్ జడ్జిమెంట్ గా జగద్విఖ్యాతమైన కథ అది. అలా అక్కడి, ఇక్కడి కథలను మిశ్రమం చేసి, ప్రేక్షకులు మెచ్చేలా చిత్రాలను అప్పట్లోనే రూపొందించారు. కానీ, అప్పుడు భారతీయ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఇంత విస్తృతమైన ఆదరణ లేదు. నవతరం ప్రేక్షకుడు మెచ్చే టెక్నాలజీతో సినిమాలు రూపొందిస్తే ప్రపంచవ్యాప్తంగా విజయం సాధించడం కష్టమేమీ కాదని ‘మ్యాట్రిక్స్’ ట్రయాలజీతో యావత్ సినిమా రంగాన్ని తమవైపు తిప్పుకున్న వచోవ్స్కీ సిస్టర్స్ అంటున్నారు. నిజానికి వారి చిత్రాలను పరిశీలిస్తే భారతీయ, బౌద్ధ గాథల్లోని పలు అంశాలు, వాటితో పాటు బైబిల్ లోని మరికొన్ని అంశాలు మిళితమై కనిపిస్తాయి.
ప్రస్తుతం టెక్నాలజీ పరంగా భారతీయ దర్శకులు హాలీవుడ్ తోనూ ఢీ కొంటున్నారు. అబ్బుర పరిచే కలర్ కాంబినేషన్స్ తో ప్రతి ఫ్రేమ్ నూ అందంగా తీర్చిదిద్దే సంజయ్ లీలా భన్సాలీ, యాక్షన్ ఎపిసోడ్స్ ను కూడా కథలా చెప్పగలిగిన రాజమౌళి, పాశ్చాత్య గాథలనే భారతీయతతో నింపి భళా అనిపించిన మణిరత్నం వంటివారు భారతదేశంలో ఉన్నారు. వీరందరూ తమ శక్తివంచన లేకుండా తమకు నచ్చిన కథలను తెరకెక్కిస్తూనే ఉన్నారు. వారికి పాశ్చాత్య దర్శకుల శైలి కూడా అబ్బితే, వారే కాదు రాబోయే రోజుల్లో నవతరం భారతీయ దర్శకులు సైతం ప్రపంచవ్యాప్తంగా అదరహో అనే చిత్రాలు రూపొందించగలరు. ఈ మాటలు అంటున్నది మన భారతీయులు కాదు, మన సంస్కృతీ సంప్రదాయాలను తమచిత్రాలలో పొందు పరచి విజయం సాధిస్తున్న హాలీవుడ్ ఫిలిమ్ మేకర్స్! మరి ఆ పంథాను ఎందరు భారతీయ దర్శకనిర్మాతలు అనుసరిస్తారో చూడాలి.