Nizam Exhibitors: మేం పెద్ది సినిమాని టార్గెట్ చేయలేదు.. పర్సనల్ టార్గెట్ చేశారు!

Nizam Exhibitors

Nizam Exhibitors

Nizam Exhibitors: తెలుగు చిత్ర పరిశ్రమలో ఎగ్జిబిటర్లు, నిర్మాతలకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలపై, ముఖ్యంగా పలువురు నిర్మాతలు చేసిన ఘాటు వ్యాఖ్యలపై తెలంగాణ ఫిలిం ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ తాజాగా తీవ్ర స్థాయిలో స్పందించింది. నగరంలో డిస్ట్రిబ్యూటర్లు, ప్రధాన ఎగ్జిబిటర్లు అంతా కలిసి పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన మీడియా సమావేశం టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఈ ప్రెస్ మీట్‌లో ఎగ్జిబిటర్లు పలు కీలక విషయాలపై కుండబద్దలు కొట్టారు. ముఖ్యంగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన ‘పెద్ది’ సినిమా వివాదాన్ని తమకు ఆపాదించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ సినిమా ఇష్యూతో తమ సంఘానికి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. వాస్తవాలు పూర్తిగా తెలుసుకోకుండా కొందరు నిర్మాతలు తమపై పర్సనల్ విమర్శలకు దిగడం ఏమాత్రం సబబు కాదని వారు హితవు పలికారు. ఇలాంటి ఆరోపణలు విరమించుకోవాలని డిమాండ్ చేశారు.

థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారిన ప్రస్తుత తరుణంలో.. ‘పర్సంటేజ్ విధానం’ అమలు కోసం తాము దశాబ్దన్నర కాలంగా (2008 నుంచి) నిరంతర పోరాటం చేస్తూనే ఉన్నామని గుర్తు చేశారు. తమ డిమాండ్లు న్యాయమైనవని, ఎగ్జిబిటర్లు బాగుంటేనే సినిమా బతుకుతుందని అన్నారు. అయితే, తాము ఎప్పుడూ ఘర్షణ వాతావరణాన్ని కోరుకోలేదని.. నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య సరైన కమ్యూనికేషన్, సమన్వయం ఉండాలన్నదే తమ ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు. టాలీవుడ్ నిర్మాతలు ఎప్పుడు చర్చలకు ఆహ్వానించినా తాము సిద్ధంగానే ఉన్నామని, సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికే మొదటి ప్రాధాన్యత ఇస్తామని వారు క్లారిటీ ఇచ్చారు.

ఇదిలా ఉంటే, వ్యాపార లావాదేవీలకు సంబంధించి తలెత్తిన విభేదాలకు ముగింపు పలికేందుకు రంగం సిద్ధమైంది. రేపు ఫిలిం ఛాంబర్ వేదికగా ఒక అత్యంత కీలకమైన భేటీ జరగనుంది. ఈ మీటింగ్‌లో ఎగ్జిబిటర్లంతా ఏకతాటిపైకి వచ్చి తమ భవిష్యత్ కార్యాచరణపై ఒక తుది నిర్ణయం తీసుకోనున్నారు. థియేటర్ల వ్యవస్థను కాపాడుకుంటూనే, పరిశ్రమలోని అన్ని వర్గాల ప్రయోజనాలకు విఘాతం కలగకుండా, నిర్మాతలకు కూడా నష్టం జరగకుండా చూసుకుంటామని ఈ సందర్భంగా భరోసా కల్పించారు. మరి రేపటి ఛాంబర్ మీటింగ్‌లో ఎగ్జిబిటర్లు ఎలాంటి సంచలన నిర్ణయం తీసుకుంటారోనని ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.