Alias Rukmini: టాలీవుడ్ హీరో నితిన్, నేచురల్ స్టార్ నాని మధ్య ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా నితిన్ హీరోగా, ‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్ దర్శకత్వంలో వస్తున్న ‘అలీయాస్ రుక్మిణి’ సినిమాను నాని సమర్పకుడిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నితిన్ పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. ముఖ్యంగా ఈ సినిమా కథ తన దగ్గరకు ఎలా వచ్చిందో చెబుతూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
‘అలీయాస్ రుక్మిణి’ కథను ముందుగా తన కోసమే రాసుకున్నారా అని అడగ్గా, నితిన్ ఒక అసలు సీక్రెట్‌ను రివీల్ చేశారు. “నిజానికి ఈ సినిమాకు ఫస్ట్ ఛాయిస్ నేను కాదు. డైరెక్టర్ మురళీకాంత్ మైండ్‌లో వేరే హీరో ఉన్నారు. కానీ నానినే పట్టుబట్టి.. ‘లేదు, ఈ కథ మా నితిన్ బాబుకు అయితేనే బాగుంటుంది’ అని చెప్పి డైరెక్టర్‌ను నా దగ్గరకు పంపించాడు” అంటూ నితిన్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా, ‘దండోరా’ లాంటి సినిమా తీసిన మురళీకాంత్ నుంచి ఇలాంటి పూర్తి భిన్నమైన, ఫ్రెష్ స్క్రిప్ట్ వస్తుందని తాను కూడా అస్సలు ఊహించలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
నానితో తనకున్న పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ నితిన్ ఎమోషనల్ అయ్యారు. 2006లో తాను నటించిన ‘అల్లరి బుల్లోడు’ సినిమాకు నాని అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారని, అప్పుడే తమ మధ్య మంచి స్నేహం మొదలైందని తెలిపారు. ఆ తర్వాత నాని హీరోగా మారి, పెద్ద స్టార్ అయి, సొంతంగా ప్రొడక్షన్ హౌస్ పెట్టడం తనకు ఎంతో గర్వంగా ఉందని అన్నారు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి రావాలనుకునే ఎంతోమందికి నాని ఒక పెద్ద ఇన్‌స్పిరేషన్ అని నితిన్ కొనియాడారు.
ఈ సందర్భంగా ఒక ఆసక్తికరమైన కోయిన్స్‌డెన్స్‌ని కూడా నితిన్ పంచుకున్నారు. సరిగ్గా 9 ఏళ్ల క్రితం నవంబర్ 25న నాని తన ప్రొడక్షన్ హౌస్ (వాల్ పోస్టర్ సినిమా) అనౌన్స్ చేసినప్పుడు.. “ఆల్ ది బెస్ట్ ప్రొడ్యూసర్ గారు” అంటూ తాను ట్వీట్ చేశానని గుర్తుచేశారు. ఇప్పుడు మళ్లీ సరిగ్గా 9 ఏళ్ల తర్వాత, నాని కొత్త బ్యానర్‌లో వస్తున్న మొదటి సినిమాకు తానే హీరో కావడం చాలా ప్రత్యేకంగా అనిపిస్తోందని నితిన్ ఆనందం వ్యక్తం చేశారు. ఇక నాని ఇప్పటికే ‘అలీయాస్ రుక్మిణి’ సినిమా చూశారని, ఆయనకు సినిమా బాగా నచ్చిందని నితిన్ తెలిపారు. మొన్న జరిగిన జామ్ పార్టీ వీడియోలో నాని చెప్పిన దానికంటే ఇంకా చాలా విషయాలు తనతో పంచుకున్నారని, సినిమా రిలీజ్ అయ్యి ప్రేక్షకులకు నచ్చిన తర్వాత వాటన్నింటినీ బయటపెడతానని నితిన్ ఆసక్తిని పెంచారు.

