నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటించిన’అంటే సుందరానికి’ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నజ్రియా నజీమ్ కథానాయికగా నటించింది. ఈ నెల 10న గ్రాండ్‌గా విడుదల కానుంది. టీజర్, ట్రైలర్ పాజిటివ్ బజ్‌తో కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందనే అభిప్రాయాన్ని కలగచేశాయి. సెన్సార్ లో క్లీన్ యు కొట్టేశాడు సుందరం. ఇక ఈ సినిమా రన్‌టైమ్ 2 గంటల 56 నిమిషాలు. ‘ఆర్ఆర్ఆర్, విక్రమ్’ చిత్రాల కోవలో దాదాపు మూడు గంటల పాటు ఉంటుందీ సినిమా. మరి ఇంత టైమ్ కామెడీతో నానీ ఆకట్టుకోగలడా అన్నది అతి పెద్ద కొచ్చెన్ మార్క్. నాని నిస్సందేహంగా ప్రతిభావంతుడైన నటుడు. అయితే దానికి తోడు సినిమాలో అతని పాత్ర కూడా క్యూరియాసిటీని కలిగించేదే అంటున్నారు.
తెలిసిన సమాచారం ప్రకారం ఇందులో నాని నపుంసకుడి పాత్ర పోషిస్తున్నాడట. బ్రాహ్మణకులానికి చెందిన నాని, క్రిష్టియన్ అయిన నజ్రియా చిన్నప్పటి నుంచి ఒకరినొకకు ఇష్టపడుతుంటారు. ఒక స్టేజ్ లో ఇద్దరూ వారి వారి ఇళ్ళలో పెళ్ళి ప్రపోజల్ పెట్టగా ఇరు వర్గాల పెద్దలు వీరి పెళ్ళికి ఒప్పుకోరు. దాంతో నజ్రియా నానిని పారిపోయి పెళ్ళి చేసుకుందామని వత్తిడి చేస్తుందట. తననుంచి తప్పించుకోవడానికి తనలో విషయం లేదని అబద్దం చెబుతాడట నాని. ఆ తర్వాత సంభవించే పరిణామాలు, చివరికి ఏం జరుగుతుందన్నది హిలేరియస్ గా ఉంటుందట. గతంలో ‘భలే భలే మగాడివోయ్’లో మతిమరపు వ్యక్తిగా నటించి ఆకట్టుకున్న నాని ఇందులో నపుంసకుండిగాను నవ్వుల పువ్వులు పూయిస్తాడట. మరి ఈ నెల 10న సుందరంగా రాబోతున్న నాని ఖాతాలో మరో హిట్ పడుతుందేమో చూడాలి.