Nagarjuna: ‘చెప్పిన డేట్‌కు రాకపోతే ఎలా?’.. ఆదర్శకుటుంబానికి నాగార్జున సూటి ప్రశ్న!

Nagarjuna

Nagarjuna

Nagarjuna: టాలీవుడ్‌లో ఇటీవల రిలీజ్ డేట్లను ప్రకటించి, ఆ తర్వాత సైలెంట్‌గా వాయిదా వేసుకోవడంపై కింగ్ అక్కినేని నాగార్జున చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డైరెక్టర్ వెంకీ కుడుముల ప్రొడ్యూస్ చేసిన ‘ఇట్లు అర్జున’ సినిమాను నాగార్జున స్వయంగా సమర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన నాగ్‌కు రిలీజ్ క్లాష్‌పై నేరుగానే ప్రశ్న ఎదురైంది. అక్టోబర్ 30న ‘ఆదర్శ కుటుంబం’ సినిమా రిలీజ్ అవుతున్నప్పటికీ మీ ‘ఇట్లు అర్జున’ థియేటర్లలోకి వస్తుందా? అని మీడియా అడగ్గా, మైక్ అందుకున్న నాగార్జున గట్టిగానే స్పందించారు. రిలీజ్ డేట్ల మార్పులపై నాగార్జున స్పందిస్తూ.. “మొదట అక్టోబర్ 2న రావాలనుకున్నారు, ఆ తర్వాత అక్టోబర్ 9 అనుకున్నారు. తీరా చూస్తే పెద్ద సినిమాలు వస్తున్నాయంటూ వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మళ్లీ అక్టోబర్ 30 అనుకుంటున్నారు. కనీసం ఈసారైనా అక్టోబర్ 30న వాయిదా పడకుండా రావాలని నేను కోరుకుంటున్నాను” అంటూ చురకలు అంటించారు. కావాలని ఎవరూ డేట్లు బ్లాక్ చేయరని, ఒక్కోసారి పరిస్థితుల వల్ల డేట్లు మిస్ అవుతాయని సర్దిచెప్పినప్పటికీ, చెప్పిన డేట్‌కు రాకపోవడం వల్ల చిన్న సినిమాలకు ఎదురయ్యే ఇబ్బందులను ఆయన మాటలు స్పష్టం చేశాయి.

సినిమా రిలీజ్ డేట్‌కు ఇచ్చే విలువ గురించి మాట్లాడుతూ తన ప్రాజెక్ట్‌ను ఉదాహరణగా ప్రస్తావించారు నాగ్. “నేను డిసెంబర్ 24న వస్తున్నానని చెప్పాను. అందుకే ఆ మాట నిలబెట్టుకోవడానికి రాత్రింబవళ్లు నిద్రలేకుండా కష్టపడి సినిమాను పూర్తి చేస్తున్నా” అంటూ కమిట్‌మెంట్ అంటే ఎలా ఉండాలో గుర్తుచేశారు. “మీలాంటి బడా స్టార్ సమర్పిస్తున్న సినిమాకే ఇలాంటి వాయిదాల పరిస్థితి వస్తోంది కదా, దీనిపై మీరేమైనా చర్యలు తీసుకుంటారా?” అని మీడియా ప్రశ్నించగా నాగార్జున “నో కామెంట్స్” అంటూ దాటవేశారు. అలాగే “పాన్ ఇండియా సినిమాల విషయంలో స్టార్ హీరోలు ఇతర భాషల్లో ప్రమోషన్లు అన్నీ చేసి, తెలుగుకి వచ్చేసరికి లోకల్ మీడియా ఇంటరాక్షన్లను అవాయిడ్ చేస్తున్నారు.. దీనిపై మీరేమంటారు?” అని అడిగిన ప్రశ్నకు కూడా ఎలాంటి వివాదానికి తావివ్వకుండా “నో కామెంట్స్” అని సమాధానమిచ్చారు. చెప్పిన తేదీకి రాకుండా డేట్లను మార్చడంపై నాగార్జున చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.