చిత్ర పరిశ్రమను కుదిపేస్తున్న ‘మీటూ’ (#MeToo) ఉద్యమం ఇప్పుడు కన్నడ పరిశ్రమ (శాండల్‌వుడ్)ను తాకింది. ‘రిచ్చి’ సినిమా నటుడు, దర్శకుడు, నిర్మాత అయిన హేమంత్‌పై ఆ సినిమా హీరోయిన్ తీవ్రమైన లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు రాజాజీనగర్ పోలీసులు హేమంత్‌ను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. ఈ సంఘటన కన్నడ చిత్రసీమలో తీవ్ర కలకలం రేపింది. బాధిత నటి 2022లో హేమంత్‌ను కలిశారు. ‘రిచ్చి’ సినిమాలో హీరోయిన్‌గా అవకాశం ఇస్తానని, రూ. 2 లక్షల పారితోషికం ఇస్తానని హేమంత్ హామీ ఇచ్చారు. అడ్వాన్స్‌గా ఇచ్చిన రూ. 60 వేల చెక్ కూడా బౌన్స్ అయిందని నటి తన ఫిర్యాదులో పేర్కొంది. సినిమా షూటింగ్ సమయం నుంచే వేధింపులు మొదలయ్యాయని ఆమె ఆరోపించింది. అసభ్యకరమైన సన్నివేశాలలో, పొట్టి దుస్తులతో నటించాలని తనపై తీవ్ర ఒత్తిడి తెచ్చేవారని ఆమె వాపోయింది. షూటింగ్ పూర్తయిన తర్వాత, ఒంటరిగా హోటల్‌కు రమ్మని పిలుస్తూ వేధించడం ప్రారంభించాడని ఆమె తెలిపింది. వేధింపుల పర్వం ఇక్కడితో ఆగలేదు.
Also Read:Nidhhi Agerwal : నేరేడు పళ్ళు.. నిధి అగర్వాల్ కళ్ళు.. హాట్ ఫొటోస్
సినిమా ప్రమోషన్ల పేరుతో నటిని ముంబైకి తీసుకెళ్లిన హేమంత్, అక్కడ ఆమెకు కూల్‌డ్రింక్‌లో మద్యం కలిపి ఇచ్చాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె మత్తులో ఉన్నప్పుడు, ఆమె ప్రైవేట్ వీడియోలు, ఫోటోలు తీసి, వాటిని అడ్డుపెట్టుకుని బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టాడని ఆరోపించింది. ఈ వీడియోలను చూపించి తనను లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడని, తాను అంగీకరించక పోవడంతో సినిమాలోని సెన్సార్ చేయని కొన్ని క్లిప్పింగ్‌లను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని ఆమె ఆరోపించింది. అంతటితో ఆగకుండా, తన తల్లిని చంపేస్తానని కూడా బెదిరించాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. గతంలో కూడా హేమంత్, నటి మధ్య సినిమా ప్రమోషన్ల విషయంలో గొడవ జరిగింది. నటి ప్రమోషన్లకు సహకరించడం లేదని హేమంత్ ఫిల్మ్ ఛాంబర్‌లో ఫిర్యాదు చేయగా, ఛాంబర్ పెద్దలు జోక్యం చేసుకుని ఇద్దరి మధ్య రాజీ కుదిర్చి పంపించారు. అయితే, ఇప్పుడు పరిస్థితి మరింత తీవ్రరూపం దాల్చి పోలీసుల వరకు వెళ్లింది. ప్రస్తుతం పోలీసులు హేమంత్‌ను అదుపులోకి తీసుకుని, నటి చేసిన ఆరోపణలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.