బాలీవుడ్ సుప్రసిద్ధ నటుడు, దర్శకుడు, నిర్మాత, మనోజ్‌కుమార్ (87) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబయి కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. దీంతో బాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మనోజ్‌కుమార్ 1937లో అభివక్త భారత్‌కు చెందిన అబోటాబాద్‌లో పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించారు. ఆయన అసలు పేరు హరికృష్ణ గోస్వామి. 1957లో ‘ప్యాషన్’ సినిమాతో నటుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి, హీరోగా ‘కాంచ్ కి గుడియా’ చిత్రం తో పరిచయం అయ్యారు. ఓ వైపు నటుడిగా అలరిస్తూనే.. 1967లో దర్శకుడిగా ‘ఉప్కార్’ మూవీతో మెగా ఫోన్ పట్టారు. అలా మనోజ్ బాలీవుడ్‌లో ఎంతో మంది అగ్రతారలతో కలిసి పనిచేసి ‘రోటీ కపడా ఔర్ మకాన్’, ‘పూరబ్ ఔర్ పశ్చిమ్’,‘క్రాంతి’ లాంటి చిత్రాలతో నటుడిగా, దర్శకుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.
ముఖ్యంగా ‘కాంచ్ కీ గుడియా’ సినిమాతో నటుడిగా తొలి బ్రేక్‌ని అందుకున్న మనోజ్ కుమార్.. కాలక్రమంలో దేశభక్తి సినిమాలకు చిరునామాగా నిలిచారు. అలా మొత్తంగా 40 ఏండ్లకు పైగా సినీ పరిశ్రమకు సేవలందించి, ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి, బాలీవుడ్ స్టార్ హీరోలతో సినిమాలు రూపొందించి విజయాలను అందుకున్న మనోజ్‌కుమార్‌కి భారత ప్రభుత్వం 1992లో పద్మశ్రీ పురస్కారంతో గౌరవించగా, 2015లో ఆయన్ను దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం కూడా వరించింది. 1999లో వచ్చి ‘జై హింద్’ ఆయన చివరి చిత్రం.