ఎన్టీయార్, రాజమౌళి కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న ‘యమదొంగ’తో తెలుగువారి ముందుకు వచ్చిన మలయాళీ నటి మమతా మోహన్ దాస్ ఆ తర్వాత కూడా పలు చిత్రాలలో నటించింది. గత కొంతకాలంగా ఆమె మలయాళ, తమిళ సినిమాలకే పరిమితమైంది. ఇదిలా ఉంటే మమతా మోహన్ దాస్ నటించిన మలయాళ చిత్రం ‘లాల్ బాగ్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాను అదే పేరుతో తెలుగులోనూ డబ్ చేస్తున్నారు. శుక్రవారం ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో మమతా మోహన్ దాస్ నర్స్ నటిస్తోంది. ఓ బర్త్ డే పార్టీ అనంతరం జరిగిన హత్యలో ఆమె కుటుంబాన్ని పోలీసులు ఇంటరాగేషన్ చేస్తారు. ఈ క్లిష్ట సంఘటనలను ఆమె ఎలా ఎదుర్కొందన్నదే ఈ చిత్ర కథ. చాలా కాలం తర్వాత మమతా మోహన్ దాస్ బలమైన పాత్రను పోషిస్తోందని నిర్మాత రాజ్ జకారియా తెలిపారు. తెలుగు నటి నందినీ రాయ్ తో పాటుగా సిజోయ్ వర్గీస్, రాహుల్ దేవ్ శెట్టి, రాహుల్ మాధవ్, అజిత్ కోషీ ఇందులో ఇతర కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం డబ్బింగ్ జరుగుతున్న ‘లాల్ బాగ్’ చిత్రాన్ని మే నెలలో విడుదల చేయబోతున్నారు.