సినిమాలను అంగీకరించే విషయంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంత కన్ ఫ్యూజన్ కు ఎవరూ గురికారేమో! ఏ దర్శకుడితో సినిమా చేయాలనే విషయంలో బన్నీ చాలా వేవరింగ్ కు గురౌతుంటాడు. అందువల్లే ‘ఐకాన్’ ప్రాజెక్ట్ మీదా నీలినీడలు కమ్ముకున్నాయంటారు!! ప్రముఖ నిర్మాత దిల్ రాజు – స్టార్ హీరో అల్లు అర్జున్ మధ్య ఉన్న అనుబంధం చాలా గాఢమైంది! దిల్ రాజు బ్యానర్ లో బన్నీ ‘ఆర్య, పరుగు, ఎవడు, దువ్వాడ జగన్నాథమ్’ సినిమాలను చేశాడు. ఆ సినిమాల జయాపజయాల మాట ఎలా ఉన్నా… ఓ నిర్మాతగా దిల్ రాజును అల్లు అర్జున్ గౌరవిస్తాడు. అలానే అర్జున్ తో ఓ బ్లాక్ బస్టర్ కొట్టాలన్నది దిల్ రాజు చిరకాల కోరిక. దాని కోసమే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో గత యేడాది ‘ఐకాన్’ మూవీ అనౌన్స్ చేశాడు. కారణాలు ఏవైనా అది అనుకున్న టైమ్ కు పట్టాలైతే ఎక్కలేదు. మరి ‘వకీల్ సాబ్’ తర్వాత అయినా ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళుతుందా? అంటే అనుమానమే.
సహజంగా దిల్ రాజు తన దర్శకులు ఎవరినీ బయటకు వదిలిపెట్టారు. మరీ ముఖ్యంగా తనకు హిట్ ఇచ్చిన తర్వాత! వేణు శ్రీరామ్ కూడా అలాంటి మనస్తత్త్వం ఉన్నవాడే. తనకు ఛాన్స్ ఇచ్చిన వారిని వదిలి అంత తేలిగ్గా బయటకు వెళ్ళలేడు. అందువల్లే మొదటి నుండి దిల్ రాజు బ్యానర్ లోనే సినిమాలు చేస్తున్నాడు. కానీ బన్నీ హీరోగా ప్రకటించిన ‘ఐకాన్’ వెంటనే సెట్స్ పైకి చేరకపోవడం అందరికీ ఎంబ్రాసింగ్ గానే ఉంది. ఈ కథను వేరే స్టార్ హీరోతో చేయడానికి ఆ మధ్య దిల్ రాజు సిద్ధమైపోయాడనీ వార్తలు వచ్చాయి. కానీ ‘అల వైకుంఠపురములో’ గ్రాండ్ సక్సెస్ తర్వాత, ‘వకీల్ సాబ్’ సూపర్ హిట్ దిశగా సాగుతున్న తరుణంలో బన్నీ – వేణు శ్రీరామ్ కాంబోనే బెటర్ అని దిల్ రాజు భావిస్తున్నాడట. అందుకే… ఫైనల్ గా ‘ఐకాన్ ‘ చేసేదీ లేనిది తేల్చి చెప్పమని బన్నీని దిల్ రాజు అడిగాడట. నిజానికి బన్నీకి కూడా మనసులో ‘ఐకాన్’ చేయాలనే ఉన్నట్టుగా ఉంది. లేకుంటే… ‘పుష్ఫ’ ప్రమోషన్స్ సందర్భంగా స్టైలిష్ స్టార్ అనే బిరుదును పక్కన పెట్టి ‘ఐకాన్ స్టార్’ అనే పదాన్ని తగిలించుకోడు కదా!