సుదీప్… పరిచయం అక్కరలేని కన్నడ స్టార్. రాజమౌళి ‘ఈగ’తో తెలుగు వారికి సుపరిచితుడయ్యాడు. ఆ తర్వాత ‘బాహుబలి’, ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రాలలో అతిథి పాత్రలలో మెరిశాడు. ‘ఈగ’ తర్వాత సుదీప్ నటించిన పలు కన్నడ చిత్రాలు తెలుగులో అనువాదమై విడుదలయ్యాయి. 2020లో ప్రేక్షకుల ముందుకు రాని సుదీప్ ఇప్పుడు వరుసగా ప్యాన్ ఇండియా సినిమాలపై దృష్టి పెట్టాడు. అతడు నటిస్తున్న మూడు సినిమాలు ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్నాయి. వాటిలో ‘కోటిగొబ్బ3’ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఈ సినిమాను ‘కోటికొక్కడు’ పేరుతో తెలుగులో విడుదల కానుంది. శివ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పూర్తిగా కమర్షియల్ ఎంటర్ టైనర్. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ హక్కులను గుడ్ సినిమా గ్రూప్ అధినేత దేవేంద్ర పొందారు. ఉగాది రోజున ఈ సినిమా కొత్త పోస్టర్ లాంచ్ చేశారు. ఈ చిత్రానికి హీరో సుదీప్ కథ అందించగా మడోన్నా సెబాస్టియన్ నాయికగా నటిస్తోంది. శ్రద్ధా దాస్, అఫ్తాబ్ శివదాసాని, రవిశంకర్ ఇతర ముఖ్య పాత్రధారులు. అర్జున్ జన్య సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ఆషిక రంగనాథ్ ఐటమ్ సాంగ్ లో మెరవనుంది. ఈ సినిమా తర్వాత కూడా సుదీప్ ‘విక్రాంత్ రోనా’, ‘కబ్జా’ చిత్రాలతో పలు భాషల్లో ఆడియన్స్ ను పలకరించనుండటం విశేషం.