బాలీవుడ్ హాట్ కపుల్ కియారా అడ్వాణీ – సిద్ధార్థ్ మల్హోత్రా దంపతులు అభిమానులకు సంతోషకరమైన వార్త చెప్పారు. ఈ జంట తాజాగా తల్లిదండ్రులు అయ్యారు. ముంబయిలోని రిలయన్స్ ఆసుపత్రిలో కియారా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి.ఈ ఏడాది ఫిబ్రవరి 28న తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన కియారా-సిద్ధార్థ్ జంట, తాజాగా తమ జీవితంలో కొత్త శకం ప్రారంభించింది. ఈ వార్తపై వారి ఫ్యాన్స్, బాలీవుడ్ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వర్షం కురిపిస్తున్నారు.
2021లో విడుదలైన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన పాపులర్ వార్ డ్రామా ‘షేర్షా’ ద్వారా కియారా-సిద్ధార్థ కాంబినేషన్ తొలి సారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో వారి కెమిస్ట్రీ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోగా, షూటింగ్ సమయంలో వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కియారా గతంలో ‘కాఫీ విత్ కరణ్ – సీజన్ 8’లో మాట్లాడుతూ, ఇటలీలోని రోమ్‌లో సిద్ధార్థ్ తనను ప్రేమగా ప్రపోజ్ చేశాడని వెల్లడించింది. ఆ తర్వాత ఇద్దరూ 2023 ఫిబ్రవరి 7న రాజస్థాన్‌లో, కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. ఇక కెరీర్ పరంగా కూడా ఈ జంట బిజీగా ఉన్నారు. కియారా నటించిన భారీ ప్రాజెక్ట్ ‘వార్ 2’ ఈ ఆగస్టు 14న విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు, సిద్ధార్థ్ మల్హోత్రా – జాన్వీ కపూర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘పరమ్ సుందరి’ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది.