భారతీయ సినీ చరిత్రలో సంచలనం సృష్టించిన ‘కేజీఎఫ్’ (KGF) సినిమాను అంత ఈజీగా ఎవరూ మర్చిపోలేరు. అందులో రాఖీ భాయ్‌కి ఎంత ఎలివేషన్ ఉంటుందో.. వాళ్ల అమ్మ క్యారెక్టర్‌కు అంతకు మించిన ఎమోషన్ ఉంటుంది. ఒక తల్లికి, కొడుకుకి మధ్య ఉన్న ఆ ఎమోషనే కేజీఎఫ్‌ను అంతటి బ్లాక్ బస్టర్ చేసింది. అందులో రాఖీ భాయ్ తల్లిగా నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది కన్నడ నటి అర్చనా జోయస్. కేజీఎఫ్‌లో చీరకట్టుతో, ఎమోషనల్ యాక్టింగ్‌తో కంటతడి పెట్టించిన ఆ అర్చనా జోయస్.. ఇప్పుడు ఏకంగా తెలుగు తెరపై గ్లామరస్ హీరోయిన్గా అరంగేట్రం చేస్తుండటం సంచలనంగా మారింది. కిషోర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాత ఎన్.ఎన్. కిషోర్ నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రంలో విజయ్ రాజ్ కుమార్ హీరోగా నటిస్తుండగా, ఆయన సరసన అర్చనా జోయస్ హీరోయిన్గా ఎంపికైంది. బుధవారం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో జరిగిన ఈ చిత్ర పూజా కార్యక్రమాలకు సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి. వినాయక్, ప్రామిసింగ్ హీరో ఆది సాయికుమార్ ముఖ్య అతిథులుగా విచ్చేసి సందడి చేశారు. వినాయక్ స్క్రిప్ట్ అందజేయగా, నిర్మాత కిషోర్ ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టారు. ఆది సాయికుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
ఈ సందర్భంగా హీరోయిన్ అర్చనా జోయస్ మాట్లాడుతూ.. “కేజీఎఫ్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులు నాపై ఎంతో ప్రేమ చూపించారు. ఇప్పుడు ఈ స్ట్రెయిట్ తెలుగు సినిమాతో హీరోయిన్గా మీ ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది” అని ఆనందం వ్యక్తం చేసింది. ఈ సినిమాతో దివాకర్ యడ్ల అనే కొత్త దర్శకుడు టాలీవుడ్‌కు పరిచయమవుతున్నాడు. గతంలో రవికుమార్ చౌదరి, ఘటికాచలం వంటి దర్శకుల వద్ద పనిచేసిన అనుభవంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. దర్శకుడు దివాకర్ మాట్లాడుతూ.. “ఇది రెండు మనసుల మధ్య పుట్టే అందమైన ప్రేమకథ. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కు నచ్చేలా ఈ ఎంటర్టైనర్ను తీర్చిదిద్దుతున్నాం. హైదరాబాద్, కేరళలో షూటింగ్ ప్లాన్ చేశాం” అని తెలిపారు. అర్జున్ రెడ్డి, అమీతుమీ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న అతిథి మైకల్ ఇందులో మరో కీలక పాత్ర పోషిస్తోంది. ఎక్కడా రాజీ పడకుండా అత్యున్నత నిర్మాణ విలువలతో ఈ సినిమాను నిర్మిస్తున్నామని, కొత్త ప్రతిభను ప్రోత్సహించడమే తమ లక్ష్యమని నిర్మాత ఎన్.ఎన్. కిషోర్ స్పష్టం చేశారు. కె.కె. రావు సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి సుధా శ్రీనివాస్ సంగీతం సమకూర్చుతున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమా.. కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

