యంగ్ హీరో కార్తికేయ శ్రీ చిత్ర మూవీ మేకర్స్ బ్యానర్ లో ఓ సినిమాలో నటిస్తున్నాడు. శ్రీసరిపల్లి దర్శకత్వంలో డబుల్ ఎయిట్ రామరెడ్డి దీనిని నిర్మిస్తున్నారు. కార్తికేయ ఎన్.ఐ.ఎ. ఆఫీసర్ గా నటిస్తున్న ఈ మూవీ టైటిల్ ను ఆదివారం ప్రకటించబోతున్నారు. ఇదే సందర్భంగా ఫస్ట్ లుక్ నూ రిలీజ్ చేయబోతున్నారు. సీనియర్ కన్నడ స్టార్ హీరో రవిచంద్రన్ మనవరాలు తాన్యా రవిచంద్రన్ ఈ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. క్లాసికల్ డాన్సర్ అయిన తాన్య ఇప్పటికే విజయ్ సేతుపతి, అధర్వ మురళీ చిత్రాలలో నాయికగా నటించింది. కార్తికేయ నటిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో మరో యువ నటుడు సుధాకర్ కోమాకుల ఓ ప్రత్యేక పాత్రను పోషిస్తున్నాడు. ఇందులో మొత్తం నాలుగు పాటలు ఉంటాయని, ‘మెంటల్ మదిలో’, ‘దొరసాని’ చిత్రాలకు స్వరాలు అందించిన ప్రశాంత్ ఆర్ విహారి దీనికి సంగీతం అందిస్తున్నారని దర్శక నిర్మాతలు తెలిపారు. వి. వి. వినాయక్ శిష్యుడైన శ్రీసరిపల్లి చెప్పిన కథ నచ్చి ఈ మూవీని తీస్తున్నామని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని రామరెడ్డి చెప్పారు.