Kannada Actresses: భారీ పాన్-ఇండియా చిత్రాల్లో నటిస్తున్నామని మురిసిపోవడమే తప్ప, ఆ ప్రాజెక్టులు తమ కెరీర్‌కు ఏమాత్రం ఉపయోగపడకపోవడంతో కన్నడ బ్యూటీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. టాలీవుడ్‌లో పాపులారిటీ తెచ్చుకుని స్టార్ లీగ్‌లోకి చేరాలని ఆశపడుతున్న శాండల్‌వుడ్ భామలకు ‘వాయిదాల పర్వం’ పెద్ద శాపంగా పరిణమిస్తోంది. అసలు ఆ సినిమాలు ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తాయో మేకర్స్‌కే స్పష్టత లేకపోవడంతో, కీలక సమయంలో వీరి కెరీర్ గ్రాఫ్ తీవ్ర ఒడిదొడుకుల్లో పడింది. తాజాగా ఈ జాబితాలోకి మరో స్టార్ హీరోయిన్ కూడా చేరడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ‘కేజీఎఫ్’ సిరీస్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీనిధి శెట్టికి ఆ తర్వాత ఆశించిన స్థాయిలో విజయాలు దక్కలేదు. సరైన అవకాశాలు లేక సతమతమవుతున్న ఈ బ్యూటీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ – వెంకటేష్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’పై భారీ ఆశలే పెట్టుకుంది. ప్రాజెక్ట్‌పై ఉన్న విపరీతమైన క్రేజ్ చూసి, చివరకు తల్లి పాత్రలో నటించడానికి కూడా వెనుకాడలేదు. అయితే ఈ సినిమాతో తన కెరీర్‌ను మళ్లీ గాడిన పెట్టాలని భావిస్తే, పోస్ట్ ప్రొడక్షన్ పనుల ఆలస్యం కారణంగా మూవీ వాయిదా పడింది. స్వయంగా నిర్మాతలే ఈ విషయాన్ని వెల్లడించడంతో శ్రీనిధి నిరీక్షణ మరింత పెరిగింది.
మరోవైపు ఆషికా రంగనాథ్ పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. తెలుగులో ఇప్పటివరకు ఒక్క చెప్పుకోదగ్గ విజయం కూడా లేని ఆషిక.. మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక సోషియో-ఫాంటసీ పాన్-ఇండియా చిత్రం ‘విశ్వంభర’లో కీలక పాత్ర దక్కించుకుంది. ఈ భారీ ప్రాజెక్ట్‌తో ఓవర్‌నైట్ స్టార్‌డమ్ కొట్టేయాలని కలలు కంటోంది. కానీ, ఈ సినిమా రిలీజ్ ఎప్పుడనేది ప్రస్తుతం మేకర్స్ కూడా తేల్చి చెప్పలేని గందరగోళంలో పడింది. విడుదల ఆలస్యమయ్యే కొద్దీ ఆషికాకు కొత్త ఆఫర్లు రావడంలోనూ బ్రేకులు పడుతున్నాయి. ఇక నభా నటేష్ కెరీర్ కూడా అనుకున్నంత జోరుగా సాగడం లేదు. ఫస్ట్ ఇన్నింగ్స్ డల్ అయ్యాక, సెకండ్ ఇన్నింగ్స్‌లో పాన్-ఇండియా సినిమాలతో రీఎంట్రీ ఇస్తున్నానన్న మాటే తప్ప సాలిడ్ హిట్ పడలేదు. రీసెంట్‌గా వచ్చిన ‘నాగబంధం’ బాక్సాఫీస్ వద్ద నిరాశపరచగా, నిఖిల్ సరసన నటిస్తున్న ‘స్వయంభు’పై గంపెడాశలు పెట్టుకుంది. కానీ ‘స్వయంభు’ టీమ్ అదిగో ఇదిగో రిలీజ్ డేట్ అంటుందే తప్ప, అధికారికంగా కచ్చితమైన డేట్‌ను లాక్ చేయలేకపోతోంది. టాలీవుడ్‌లో చక్రం తిప్పుదామని వచ్చిన శాండల్‌వుడ్ ముద్దుగుమ్మలకు ఈ అనిశ్చితి, అంతులేని వాయిదాలు శాపంగా మారుతున్నాయి. క్రేజీ ప్రాజెక్టులు చేతిలో ఉన్నా.. రిలీజ్ డేట్లు తేలకపోవడంతో వీరి కెరీర్ ఎటువైపు పయనిస్తుందో వేచి చూడాలి.

