పాస్ పోర్ట్ రెన్యువల్ విషయంలో పోలీసుల నుండి ఎదురైనా ఇబ్బందులను తొలగించమంటూ ముంబై హైకోర్టును ఆశ్రయించిన కంగనా రనౌత్ కు అక్కడ చుక్కెదురైంది. పి.బి. వర్లే, ఎస్.పి. తావ్డే తో కూడిన బెంచ్ ఈ కేసును ఈ నెల 25కు వాయిదా వేసింది. అంతేకాదు… ఈ కేసులో పాస్ పోర్ట్ అధికారులను పార్టీగా పెట్టకపోవడాన్ని తప్పుపట్టింది. ఈ నెలలో తాను బుడాపెస్ట్ లో జరుగబోతున్న ‘థక్కడ్’ షూటింగ్ లో పాల్గొనాల్సి ఉందని, కానీ తనపై నమోదైన కేసుల కారణంగా పాస్ పోర్ట్ ను అధికారులు రెన్యూల్ చేయలేమని చెప్పారని కంగనా పిటీషన్ లో పేర్కొంది. అయితే… నిజంగా విదేశాలకు వెళ్ళాల్సిన అవసరం ఉండి ఉంటే… పూర్తి వివరాలతో కంగనా పిటీషన్ వేసి ఉండాల్సిందని, ఇప్పుడు ఇచ్చిన సమాచారం అస్పష్టంగా ఉందని కోర్టు విమర్శించింది. కేసు విచారణను ఈ నెల 25కు వాయిదా వేస్తూ, అప్పుడు పూర్తి వివరాలు ఇవ్వమని కోరింది. వీలైనంత త్వరగా హియరింగ్ కు ఉత్తర్వులు ఇవ్వమని కంగనా తరఫు న్యాయవాది కోరినా, బెంచ్ పట్టించుకోలేదు. సినిమా షూటింగ్ సంవత్సరం పైనే జరుగుతుందని, ఓ వారం ఆలస్యంగా షెడ్యూల్ మొదలైనా పెద్ద నష్టం ఏమీ లేదని పేర్కొంది. నిజంగానే షూటింగ్ కు ఇబ్బంది కలగకూడదని కంగనా కోరుకుని ఉంటే… పక్కా సమాచారంతో పిటీషన్ వేసి ఉండేవారని బెంచ్ అభిప్రాయపడింది. 25వ తేదీ కంటే ముందు ఈ కేసును వాయిదా వేయలేమని న్యాయమూర్తులు స్పష్టం చేశారు.