గచ్చిబౌలి విప్రో సర్కిల్ వద్ద ఉన్న ప్రముఖ ప్రిజం పబ్‌లో టాలీవుడ్ నటి కల్పికపై దాడి జరిగిన ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపింది. బర్త్‌డే కేక్ విషయంలో పబ్ నిర్వాహకులతో జరిగిన వాగ్వాదం తీవ్రమైన నేపథ్యంలో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నటి కల్పిక, తన స్నేహితులతో కలిసి ఒక బర్త్‌డే వేడుకలో పాల్గొనేందుకు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ప్రాంతంలో ఉన్న ప్రిజం పబ్‌కు వెళ్లినట్లు సమాచారం. ఈ సందర్భంగా బర్త్‌డే కేక్‌కు సంబంధించిన విషయంపై కల్పిక మరియు పబ్ సిబ్బంది మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ వివాదం కాస్త తీవ్రమై, పబ్ నిర్వాహకులు కల్పికపై బూతులతో రెచ్చిపోయి, ఆమెపై దాడికి దిగినట్లు తెలుస్తోంది.
Also Read : Sreeleela : శ్రీలీల ఆశలపై నీళ్లు చల్లిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’..!
కల్పిక ఆరోపణల ప్రకారం, పబ్ సిబ్బంది ఆమెను ‘డ్రగ్గిస్ట్’ అంటూ అవమానకరంగా మాట్లాడటమే కాక, దురుసుగా ప్రవర్తించారు. ఈ ఘటనతో ఆగ్రహించిన కల్పిక, పబ్ యాజమాన్యం పట్ల పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించగా, పోలీసులు కూడా తగిన సహకారం అందించలేదని ఆమె ఆరోపించారు. అనంతరం స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. పబ్ సిబ్బంది, నిర్వాహకులపై ఆరోపణలను పరిశీలిస్తున్న పోలీసులు, ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను సేకరించి, సాక్షుల వాంగ్మూలాలను రికార్డు చేసే పనిలో ఉన్నారు. కల్పిక ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పబ్ నిర్వాహకులు తనపై దాడి చేయడమే కాక, అవమానకరంగా మాట్లాడారని, పోలీసులు కూడా తన ఫిర్యాదును సీరియస్‌గా తీసుకోలేదని ఆమె ఆరోపించారు. ఈ ఘటన తనను మానసికంగా కృంగదీసిందని, ఇలాంటి పరిస్థితులు ఎవరికి ఎదురు కాకూడదని ఆమె పేర్కొన్నారు. ఇటీవల బేబీలాన్ పబ్‌లో జరిగిన గొడవ మరవకముందే, ప్రిజం పబ్‌లో ఈ దాడి జరగడం ఆందోళనకు గురిచేస్తోంది. నగరంలోని పబ్‌లలో భద్రతా ప్రమాణాలు, సిబ్బంది ప్రవర్తనపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.