Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్

Kalki

Kalki

హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌లో ఘనంగా జరిగిన ‘ఐ యామ్ గేమ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ వేడుకకు స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ముఖ్య అతిథిగా విచ్చేయగా, హీరో దుల్కర్ సల్మాన్ చేసిన వ్యాఖ్యలు కార్యక్రమానికి సరికొత్త జోష్‌ను తీసుకొచ్చాయి. ముఖ్యంగా వీరిద్దరూ ‘కల్కి’ సీక్వెల్ షూటింగ్‌పై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈవెంట్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన ప్రధాన అంశం ‘కల్కి’ ప్రాజెక్ట్. వేదికపై నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. ‘కల్కి’ తర్వాతి షెడ్యూల్ ఎప్పుడు ప్రారంభమవుతుందో ప్రస్తుతం తనకే స్పష్టత లేదని సరదాగా వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు కేవలం 10 రోజుల షూటింగ్ మాత్రమే పూర్తి చేశామని, ప్రభాస్ డేట్స్ ఖాళీ అయ్యి, ఆయన ఫ్రీ అయిన తర్వాతే పూర్తి స్థాయి చిత్రీకరణను మళ్లీ పట్టాలెక్కిస్తామని స్పష్టం చేశారు.

ఇదే అంశంపై దుల్కర్ సల్మాన్ స్పందిస్తూ.. “కల్కి తర్వాతి భాగంలో నా పాత్రకు సంబంధించి షూట్ ఉందంటే, ఇప్పటికిప్పుడు నేరుగా సెట్స్‌కు వెళ్లిపోవడానికి నేను సిద్ధం” అంటూ తన అమితమైన ఆసక్తిని బయటపెట్టారు. దర్శకుడు నాగ్ అశ్విన్ వేదికపైకి దర్శకుడు అనుదీప్ కేవీ శైలిలో ఫుల్ ఎనర్జీతో నవ్వులు పూయిస్తూ ఎంట్రీ ఇచ్చారు. “దాదాపు ఏడాది క్రితం దుల్కర్ నిర్మించిన ‘లోకా’ చిత్రానికి సపోర్ట్ చేసేందుకు వచ్చాను, మళ్లీ ఇప్పుడు ఆయన సినిమా వేడుకకు రావడం ఆనందంగా ఉంది. ‘ఐ యామ్ గేమ్’ కేవలం ఒక యాక్షన్ సినిమా మాత్రమే కాదు, ఇందులో ప్రేక్షకులను ఆద్యంతం అలరించే అద్భుతమైన వినోదం (ఫన్) కూడా ఉంది” అని సినిమా విజయంపై నమ్మకం వ్యక్తం చేశారు.