తాత సీనియర్ ఎన్టీఆర్ ఆశీస్సులు ఉన్నంతవరకూ తననెవరూ ఆపలేరని వార్ టూ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో జూనియర్ ఎన్టీఆర్ పంచ్ డైలాగ్ పేల్చారు. చంద్రబాబు, లోకేష్ కు ఆయన డైరక్ట్ వార్నింగ్ ఇ్చచారు. ఎప్పటికైనా టీడీపీలోకి వస్తానని తేల్చేసిన జూనియర్ ఎన్టీఆర్.. తనను చంద్రబాబు కానీ, లోకేష్ కానీ ఆపలేరని హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే పార్టీలో ఓ వర్గం జూనియర్ ఎన్టీఆర్ రావాలని బలంగా కోరుకుంటోంది. వారిని మరింత సంతోషపెట్టే విధంగా జూనియర్ ఎన్టీఆర్ నేరుగా వార్నింగ్ బెల్ మోగించడం.. రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.
జూనియర్ ఎన్టీఆర్ చిన్న వయసులోనే ఎన్నో ఢక్కామొక్కీలు తిని ప్రస్తుత స్థానానికి చేరుకున్నారు. హరికృష్ణ కొడుకైనా చిన్నప్పట్నుంచీ నందమూరి కుటుంబానికి దూరంగానే ఉన్నారు. చివరకు టాలీవుడ్ లో స్టార్ డమ్ వచ్చాకే ఆ కుటుంబం ఆయన్ను దగ్గరకు తీసుకుంది. కానీ తండ్రి మరణం తర్వాత మళ్లీ నందమూరి కుటుంబంతో తారక్ కు దూరం పెరిగింది. తాను స్వశక్తితోనే ఎదిగానని గుర్తుచేస్తూ.. తాత ఎన్టీఆర్ ఆశీస్సులు ఉన్నంతవరకూ నన్నెవరూ ఆపలేరని జూనియర్ ఎన్టీఆర్ స్పష్టంగా చెప్పేశారు.
వార్ టూ ప్రీరిలీజ్ ఫంక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఎవర్ని టార్గెట్ చేసుకుని ఆయన ఈ మాటలు అన్నారు..? నన్ను మీరెవరూ ఆపలేరంటే.. తారక్ ను అసలు ఎవరు ఆపుతున్నారు..? సినిమా ఇండస్ట్రీలో అలాంటి వాతావరణం లేదు. జూనియర్ ఎన్టీఆర్ ని తొక్కెయ్యాలని…అడ్డుకోవాలని…ఆపాలనే ఉద్దేశం..ప్రయత్నం సినిమా ఇండస్ట్రీలో ఎవరూ చేయడం లేదు. కాబట్టి సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్లను ఆయన టార్గెట్ చెయ్యలేదు. ఇక మిగిలింది పాలిటిక్స్ఎవరో ఆయన్ని ఆపకపోతే.. తన తాత పేరు ప్రస్తావిస్తూ.. నన్ను మీరు ఆపలేరు అంటే.. ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ ని టార్గెట్ చేసి.. జూనియర్ ఎన్టీఆర్ ఈ మాటలు అన్నారా..? ఈ విషయంపైనే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది.
తారక్ కొంతకాలం క్రితం వరకూ నందమూరి, నారా కుటుంబాలకు చాలా ఆప్తుడు. నందమూరి హరికృష్ణ రెండో భార్య సంతానమైన జూనియర్ ఎన్టీఆర్ ని చాలా సంవత్సరాలు నందమూరి కుటుంబం తమలో కలుపుకోలేదు. హీరోగా సూపర్ సక్సెస్ అయిన తర్వాతే తారక్ కి ఆ ఫ్యామిలీలో ఎంట్రీ దొరికింది. హీరోగా ప్రస్థానం మొదలైన కొత్తలో బాలకృష్ణ పేరు తలవకుండా.. బాబాయ్ బాబాయ్ అని పిలవకుండా జూనియర్ ఎన్టీఆర్ ప్రసంగం ఉండేది కాదు. నందమూరి కుటుంబంలో జరిగే అన్ని కార్యక్రమాల్లో తారక్ భాగస్వామిగా ఉండేవారు.
కానీ అడపాదడపా నందమూరి-నారా కుటుంబాలకు, జూనియర్ ఎన్టీఆర్ కు మధ్య ఉన్న గ్యాప్ బయటపడేది. తారక్ సినీ రంగంలో కుదురుకున్న తర్వాత.. క్రమంగా బాబాయ్ ప్రస్తావన తగ్గించారనేది బాలకృష్ణ సన్నిహితుల అభిప్రాయం. కానీ ఇలాంటి చిన్న చిన్న మనస్పర్థలు వచ్చినా.. తమ మధ్య దూరం లేదని, అంతా బాగానే ఉన్నామని జూనియర్ ఎన్టీఆర్ చెబుతూ వచ్చేవారు. పైగా టీడీపీకి తన మద్దతూ ఎప్పుడూ ఉంటుందని కూడా బహిరంగ సభల్లో స్పష్టం చేశారు. దీంతో కొన్ని దుష్టశక్తులు తారక్ ను నందమూరి – నారా కుటుంబాలకు దూరం చేసే కుట్ర చేస్తున్నాయని టీడీపీ వర్గాలు ఆరోపించేవి.
హరికృష్ణకు టీడీపీలో పదవుల విషయం.. జూనియర్ ఎన్టీఆర్, చంద్రబాబు మధ్య సంబంధాలు వంటివి కొంతకాలం నడిచాయి. ఆ తర్వాత హరికృష్ణ మరణించారు. అప్పట్నుంచీ తారక్ టీడీపీ కార్యక్రమాల్లో కనిపించడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదేం లేదని జూనియర్ ఎన్టీఆర్ ను పిలవడం లేదని ఆయన సన్నిహితులు చెబుతుంటే.. కొత్తగా బొట్టు పెట్టి పిలిచేదేంటని పార్టీ వైపు నుంచి కౌంటర్ వచ్చేది. ఈ క్రమంలోనే లోకేష్ కోసం తారక్ ను దూరం పెడుతున్నారన ప్రచారం నడిచింది. అయితే ఈ ప్రచారంలో నిజం లేదని అటు జూనియర్ ఎన్టీఆర్, ఇటు లోకేష్ ఇద్దరూ ఖండించారు. ఇప్పట్లో రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని, దానికి ఇంకా టైముందని కూడా తారక్ గతంలో అన్నారు. లోకేష్ కూడా జూనియర్ ఎన్టీఆర్ వస్తే సంతోషమేనని మాట్లాడారు. దీంతో వీరిద్దరి మధ్య వైరం పెట్టే కుట్ర కూడా ప్రత్యర్థులదేనని టీడీపీ విరుచుకుపడింది.
మొత్తం మీద నందమూరి – నారా కుటుంబాలతో తారక్ బంధం ఎప్పుడూ ఒకేలా లేదనేది వాస్తవం. కొంతకాలం సన్నిహితంగా, మరికొన్నాళ్లు దూరదూరంగా.. ఇంకొన్నాళ్లు ఎడముఖం పెడముఖంగా ఉంటూ వచ్చారు. ఈ గ్యాప్ ను ప్రత్యర్థులు కూడా అడ్వాంటేజ్ తీసుకున్నారు. చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నప్పుడు ఉద్దేశపూర్వకంగా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తెచ్చేవారు. మొదట్లో ఇలాంటి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించిన తారక్.. తర్వాత అసలు స్పందించడం మానేశారు. అయినా సరే ఆయన మౌనానికి కూడా రకరకాల అర్థాలు తీయడం ఎవరూ ఆపలేదు.
కొన్నాళ్ల పాటు వ్యూహాత్మక మౌనం పాటించిన జూనియర్ ఎన్టీఆర్.. ఇప్పుడేదో ఆలోచనతోనే ప్రీరిలీజ్ ఫంక్షన్లో వ్యాఖ్యలు చేశారనే చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఎటువైపు నుంచి ఎలాంటి కవ్వింపులు లేకుండా.. తారక్ మాట్లాడారంటే.. కచ్చితంగా రాజకీయంగా పరోక్ష సంకేతాలిచ్చినట్టే అంటున్నారు. మొన్నటి ఎన్నికల దగ్గర్నుంచి ఏపీ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన బాగా తగ్గిపోయింది. ఇలాంటి సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు.. ఎవరి కోసం ఎందుకోసం అనే ప్రశ్నలు దూసుకొస్తున్నాయి.
తారక్ అంత తొందరగా బయటపడే వ్యక్తి కాదు. ఆయన్ను అంచనా వేయడం అంత తేలిక కాదని సన్నిహితులు చెబుతుంటారు. లోతైన మనిషి అయిన జూనియర్ ఎన్టీఆర్.. మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో తాత పేరు ప్రస్తావిస్తూ.. ఆయన ఆశీస్సులు నాకున్నాయని చెబుతూనే.. నన్నెవరూ ఆపలేరనడాన్ని చిన్న విషయంగా తీసుకోవటానికి ఎవరూ సిద్ధంగా లేరు. అదేదో యథాలాపంగా చేసిన వ్యాఖ్యలా కూడా అనిపించలేదు. ఆచితూచి ఎంత అవసరమో అంతే మాట్లాడారనే చర్చ కూడా జరుగుతోంది. ఇటు రాజకీయ వర్గాల్లో తారక్ వ్యాఖ్యలపై చర్చ జరగడం సహజమే. కానీ సినీ వర్గాల్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ఆకాంక్షలు, పరోక్ష సంకేతాలపై అంతర్మథనం జరుగుతోందనే వారూ ఉన్నారు. ఈ వాదనలో నిజానిజాల సంగతి పక్కనపెడితే.. సామాన్య ప్రజల్లో సైతం తారక్ వ్యాఖ్యలు ఎక్కడలేని ఆసక్తి రేకెత్తించాయనడంలో సందేహం లేదు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యలకు ఎవరైనా రియాక్ట్ అవుతారా.. లేదంటే అలా వదిలేస్తారా అనేది కూడా చూడాల్సిన విషయమే. ఇక ముందు జరగబోయే పరిణామాలు తారక్ సంకేతాలకు అసలైన అర్థం చెబుతాయనే వారూ లేకపోలేదు. అయితే జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చిన్న సైజు ప్రకంపనలు సృష్టించాయనే అభిప్రాయాలున్నాయి.
జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలోకి రావాలని, నాయకత్వం వహించాలని పార్టీలో ఓ వర్గం బలంగా కోరుకుంటోంది. గతంలో ఎన్నికల ప్రచారం కూడా చేసిన తారక్.. తెలుగు రాష్ట్రాల ప్రజల్ని తన స్పీచులతో ఆకట్టుకున్నారు. పార్టీ మహానాడులకు కూడా హాజరై.. క్యాడర్ మదిని కూడా దోచారు. మధ్యలో కొన్నాళ్లు రాజకీయాలకు విరామం ఇచ్చినా.. రావాలనుకున్నప్పుడు తాను వస్తానని, ఎవరూ ఆపలేరని జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు, లోకేష్ కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
2009లో యాక్టివ్ పాలిటిక్స్ లో అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్.. టీడీపీ తరపున తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రచారం చివర్లో రోడ్డు ప్రమాదానికి గురై కొన్నాళ్ల పాటు మంచానికే పరిమితమయ్యారు. అప్పట్లో తారక్ ప్రచారానికి ఉమ్మడి రాష్ట్రంలో మంచి స్పందన వచ్చింది. సీనియర్ ఎన్టీఆర్ పోలికలు, హావభావాలతో పాటు.. స్పీచులు కూడా ఆయన్ను పోలి ఉండటంతో.. జనం త్వరగా కనెక్ట్ అయ్యారు. దీంతో టీడీపీ నేతలు కూడా జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం కోసం పోటీపడ్డారు.
తారక్ గాయాల నుంచి కోలుకున్న తర్వాత.. టీడీపీ మహానాడుల్లో కూడా పాల్గొన్నారు. తన ప్రసంగాలతో శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. తరచుగా చంద్రబాబును కలిసేవారు. టీడీపీ కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జరిగిన చర్చల్లో కూడా పాలుపంచుకున్నారని పార్టీ వర్గాలు చెబుతాయి. దీంతో పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ పాత్రేంటనే చర్చ మొదలైంది. ఆయనకు ఏదో ఒక పదవి ఇస్తే బాగుంటుందనే చర్చ కూడా తెర పైకి వచ్చింది. కానీ అక్కడే ఓ అయోమయ పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే అప్పటికి తారక్ ఇంకా పూర్తిస్థాయి రాజకీయాలకు సిద్ధంగా లేరు. ఆయనకు ఇంకా చాలా సినీ భవిష్యత్తు ఉంది. రాజకీయాలకు ఇప్పుడేం తొందరలేదనే భావనతోనే ఉన్నారు. నందమూరి – నారా కుటుంబాలు కూడా అలాగే ఆలోచించాయి. దీంతో పరస్పర ఏకాభిప్రాయంతోనే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయంగా గెస్ట్ అప్పియరెన్స్ కే పరిమితమయ్యారు.
కానీ క్రమంగా ఆ గెస్ట్ అప్పియరెన్స్ కూడా బాగా తగ్గిపోతూ వచ్చింది. దీంతో టీడీపీకి తారక్ అవసరం లేదనే ప్రచారం కూడా ఓ వర్గం చేసింది. దాన్ని జూనియర్ ఎన్టీఆర్ వర్గం గట్టిగానే ఖండించింది. చివరకు ఈ వర్గపోరు పార్టీలో అనవసర సమస్యలకు దారితీస్తోందని చంద్రబాబు సర్దిచెప్పాల్సి వచ్చింది. ఇలాంటి పరిణామాలు చాలా జరిగాయి. ఓ దశలో తారక్ పై కేవలం టీడీపీలోనే కాకుండా మిగతా పార్టీల్లోనూ చర్చ జరిగింది. రాజకీయంగా ఎలాంటి కీలక పరిణామం జరిగినా.. జూనియర్ ఎన్టీఆర్ స్పందన కోసం ఎదురుచూసిన రోజులు కూడా ఉన్నాయి. చివరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా హైదరాబాద్ వచ్చినప్పుడు తారక్ తో ముఖాముఖి భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇలా రాజకీయాల్లో అంత యాక్టివ్ గా లేకపోయినా.. జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడూ పొలిటికల్ లైమ్ లైట్ లోనే ఉన్నారు. ఇప్పటికీ టీడీపీ శ్రేణులకు తారక్ ఏం చెబుతారో వినాలనే కుతూహలం లేకపోలేదు. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎన్నికల ప్రచారానికి వస్తే పార్టీకి ఇంకా ఓట్లు పెరుగుతాయనే అభిప్రాయం కూడా ఓ వర్గంలో ఉంది.
ఇక తారక్ విషయానికొస్తే పార్టీ గురించి, రాజకీయాల గురించి ఆయనకు కొన్ని స్పష్టమైన ఆలోచనలున్నాయి. ఇటీవల గుంభనంగా వ్యవహరిస్తున్నా.. గతంలో ఆయన తన పొలిటికల్ కెరీర్ గురించి చాలా క్లారిటీగానే మాట్లాడారు. టీడీపీ తమ ఇంటి పార్టీ అని, ఆ పార్టీ కార్యక్రమాలకు తననెవరూ పిలవాల్సిన పని లేదని, తనకు వీలున్నప్పుడు వస్తూనే ఉంటానని తేల్చేశారు. అంతేకాదు టీడీపీకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా.. ముందుంటానని, అవసరమైతే ప్రాణం కూడా ఇస్తానని అప్పట్లో ప్రకటన చేశారు జూనియర్ ఎన్టీఆర్. ఎవరో కొందరి రాజకీయ ప్రయోజనాల కోసం తాను పావుగా మారదలుచుకోలేదని కూడా ప్రత్యర్థులకు చురకలు అంటించారు. చంద్రబాబు విషయంలో కూడా తారక్ సానుకూలంగానే మాట్లాడారు. పార్టీని ఆయన నిలబెట్టారని కితాబు కూడా ఇచ్చారు. గతంలో ఆయన సన్నిహితులు వైసీపీలోకి వెళ్లినప్పుడు కూడా.. వారి వెనుక తన హస్తం ఉందన్న ప్రచారాన్ని జూనియర్ ఎన్టీఆర్ గట్టిగా ఖండించారు. కలలో కూడా టీడీపీకి ద్రోహం చేసే ఉద్దేశం తనకు ఉండదని భావోద్వేగానికి గురయ్యారు. తన మానన తాను సినిమాలు చేసుకుంటోంటే.. అనవసరంగా వివాదాల్లోకి లాగుతున్నారని కూడా వాపోయారు. అంతేకాదు పాలిటిక్స్ గురించి పది, పదిహేను, ఇరవయ్యేళ్లు పోయాక ఆలోచిస్తానని, ప్రస్తుతం తనకు తగిన వయసు రాలేదని భావిస్తున్నానని చెప్పారు. వివిధ సందర్భాల్లో తారక్ చేసిన ఈ వ్యాఖ్యలు ఆయన రాజకీయ పరిణతిని చాటిచెబుతున్నాయి.
మరి అలాంటి జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడెందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారనే ప్రశ్నలకు ఆయన సన్నిహితులు కొందరు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తారక్ ఎవరి పేరూ ప్రస్తావించలేదు. రాజకీయాల ప్రస్తావన తేలేదు. కేవలం తాత పేరు చెప్పుకున్నారు. ఈ మాత్రం దానికి గోరొంతలు కొండంతలు చేయాల్సిన పనిలేదనేది జూనియర్ ఎన్టీఆర్ సన్నిహితుల మాటగా ఉంది. కానీ అంతేనా. ఇంకేదో ఉందనే చర్చకు మాత్రం తెరపడటం లేదు. ఏ ఉద్దేశం లేకపోతే మూవీ ఫంక్షన్లో ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తారనే ప్రశ్నలు వస్తున్నాయి. పైగా ఆ వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు తారక్ చూపిన హావభావాలు కూడా చెప్పాల్సిన వారికి ఏదో చెబుతున్నట్టే ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ స్వతహాగా ఆవేశపరుడు కాదు. కాబట్టి ఇప్పుడు కూడా ఏదో మాస్టర్ స్ట్రోక్ లో భాగంగానే కామెంట్స్ చేశారనే వాదనకు బలం చేకూరుతుంది. కానీ అలాగే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏం లేదని కూడా తారక్ క్యాంప్ అంటోంది. జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యల్ని చిలవలు పలవలు చేయడం మానేయాలని సలహా ఇస్తోంది. తారక్, నందమూరి నారా కుటుంబాల మధ్య ఏదున్నా అది ఫ్యామిలీ మ్యాటరేనని, అది వారు పరిష్కరించుకోగలరనే వాదన కూడా వినిపిస్తోంది.
తాత ఎన్టీఆర్ పెట్టిన పార్టీకి చివరిదాకా తోడుంటానని గతంలోనే చెప్పారు జూనియర్ ఎన్టీఆర్. ఇప్పుడు మరింత క్లారిటీ ఇస్తూ.. ఎప్పటికైనా టీడీపీకి నాయకత్వం వహించేది తానేననే సంకేతాలిచ్చేశారు. సీనియర్ ఎన్టీఆర్ కు అసలైన రాజకీయ వారసుడ్ని తానేనని కూడా జూనియర్ ఎన్టీఆర్ కుండబద్దలు కొట్టారు. జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి తర్వాత జరిగిన పరిణామాలు తారక్ కి, నందమూరి కుటుంబానికి మధ్య దూరం పెంచేశాయి. తారక్ మామ నార్నె శ్రీనివాసరావు ఏకంగా వైసీపీలో చేరడం, జూనియర్ ఎన్టీఆర్ ను జగన్ కోవర్టుగా నారా కుటుంబం ముద్ర వేయడంతో.. నారా, నందమూరి కుటుంబాలకు తారక్ పూర్తిగా దూరమైపోయారు. నారా, నందమూరి కుటుంబాలు జూనియర్ ఎన్టీఆర్ ను ఏ ఫంక్షన్ కూ పిలవవు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను కూడా తారక్ లేకుండానే ముగించేశారు. జూనియర్ ఎన్టీఆర్ ఎప్పటికైనా రాజకీయాల్లో లోకేష్ కు పోటీ అవుతారని, తారక్ ఇప్పుడు కాకపోయినా పదేళ్ల తర్వాతైనా వచ్చి తాత పార్టీని కైవసం చేసుకోవాలని కరడుగట్టిన టీడీపీ, ఎన్టీఆర్ అభిమానులు ఆశిస్తుంటారు. టీడీపీలోనే ఓ వర్గం కూడా ఎప్పటికైనా పార్టీని జూనియర్ ఎన్టీఆర్ హస్తగతం చేసుకోవాలని భావిస్తుంటుంది. ఎన్టీఆర్ కు అసలు సిసలైన వారసుడు తారక్ మాత్రమేనని, ఈరోజు కాకపోయినా రేపైనా పార్టీని ఆయన నడిపిస్తారని చంద్రబాబు వ్యతిరేకులు చెబుతుంటారు. ఇప్పుడు వార్ టూ ఫంక్షన్లో జూనియర్ ఎన్టీఆర్ వాడిన పదజాలం చాలా పవర్ ఫుల్ గా ఉంది. అదే విషయాన్ని గుర్తుచేస్తోంది.
నన్నెవరూ ఆపలేరు అంటే.. ఏదో ఒక రోజు తాను టీడీపీలోకి వచ్చి తీరుతానని తారక్ చెబుతున్నారా..? పైగా ఎన్టీఆర్ ఆశీస్సులు నాకున్నాయని చెప్పటం ద్వారా నేనే అసలైన వారసుడినని జూనియర్ ఎన్టీఆర్ మరోసారి ప్రకటించుకున్నారా..? నన్ను మీరు ఆపలేరు అనడం ద్వారా చంద్రబాబు, లోకేష్ ను పరోక్షంగా హెచ్చరించారా..? దేవుడు చల్లగా చూస్తే ఇలాగే ముందుకు వెళ్దాం. నేను ఒక్కడినే కాదు మీ అందరి తోడుగా అంటూ చెప్పాల్సిన విషయాన్ని పూర్తిగా చెప్పకపోయినా.. తన మనసులో ఏదో పెద్ద ఆలోచన ఉందనే విషయాన్ని మాత్రం జూనియర్ ఎన్టీఆర్ బయటపెట్టారు. ఇప్పుడు కాకపోయినా టీడీపీ ఎప్పటికైనా నాదేనని తారక్ హెచ్చరిస్తున్నట్టుగా స్వరం వినిపించింది. నన్ను మీరు ఆపలేరు అని క్రౌర్యం నిండిన కళ్లతో చెబుతుంటే.. ఆపాలనుకున్నవారికి మాత్రం జూనియర్ ఎన్టీఆర్ హెచ్చరిక స్పష్టంగా అర్థం అవుతుంది.
తారక్ తన తాత పార్టీ టీడీపీని ఎప్పటికైనా కైవసం చేసుకుంటాడని..టీడీపీకి తిరిగి వస్తాడనేది కొందరి విశ్వాసం. జూనియర్ ఎన్టీఆర్ కూడా కట్టె కాలేంత వరకు టీడీపీలోనే వుంటానని చెప్తుంటారు. కానీ ఇప్పుడు నన్ను ఎవరూ ఆపలేరు అంటే ఏమిటి? టీడీపీలోకి తనను రాకుండా ఎవ్వరూ అడ్డుకోలేరని చెప్తున్నారా? ఒకవేళ పదేళ్ల తర్వాత తారక్ వస్తే అప్పటి పరిణామాలు ఎలా వుంటాయి? ఎప్పటికైనా తాను టీడీపీలోకి వస్తానంటూ జూనియర్ ఎన్టీఆర్ చెప్తున్నారా?. ఈ విషయమే ఇప్పుడు ఎవరికీ అంతుబట్టడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్ని బట్టి చూస్తే.. తారక్ సినిమా రంగం గురించి మాట్లాడలేదని, తన రాజకీయ ఆకాంక్షల్ని పరోక్షంగా బయటపెట్టారనే ప్రచారం గట్టిగా జరుగుతోంది.
కొంత కాలం క్రితం జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్ని టీడీపీ టార్గెట్ చేసింది. విడుదలకు ముందే ఫ్లాప్ టాక్ స్ప్రెడ్ చేసేది. ఈ వాతావరణం కొంతకాలం నడిచింది. కానీ అలాంటి సమయంలో కూడా తారక్ ఎప్పుడూ ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి మీద వల్లభనేని వంశీ, కొడాలి నాని, అంబటి రాంబాబు లాంటి వాళ్లు చేసిన కామెంట్స్ మీద నందమూరి ఫ్యామిలీ సహా టీడీపీ శ్రేణులన్నీ రియాక్టయ్యాయి. ఖండించాయి. కానీ జూనియర్ ఎన్టీఆర్ వెంటనే ఆ పని చేయలేదు. దీంతో ఆయన్ను టార్గెట్ చేస్తూ విమర్శలు, ట్రోల్స్ వచ్చాయి. ఏమనుకున్నారో ఏమో కానీ కొద్ది రోజుల తర్వాత నేరుగా కాకుండా పరోక్షంగా ఆ ఎపిసోడ్ ను తప్పుబడుతూ వీడియో విడుదల చేశారు తారక్. అది కూడా వివాదం అయింది. మేనత్తని అవమానిస్తే.. నేరుగా స్పందించలేకపోయారంటూ టీడీపీ శ్రేణులు తప్పుబట్టాయి. ట్రోల్ చేశాయి.
హరికృష్ణ దగ్గర్నుంచే ఆయన ఫ్యామిలీ టీడీపీకి దూరంగా ఉండటం మొదలుపెట్టింది. తన కొడుకుని పార్టీ టార్గెట్ చేయటాన్ని హరికృష్ణ జీర్ణించుకోలకపోయారు. రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా రాజ్యసభలోనే రాజీనామా చేసిన తర్వాత హరికృష్ణ పార్టీకి దూరమయ్యారు. హరికృష్ణ మరణం తర్వాత ఆయన కుటుంబానికి, నందమూరి-నారా కుటుంబాలకు మధ్య గ్యాప్ పెరిగింది. అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ కు పాన్ ఇండియా క్రేజ్ రావడంతో.. ఆయన దృష్టంతా కెరీర్ మీదే పెట్టారు. మొదట్లో దూరంగా ఉండే హరికృష్ణ పెద్ద కుమారుడు కల్యాణ్ రామ్ తో మాత్రమే తారక్ అప్పుడప్పుడు కలిసి కనిపిస్తున్నారు.
ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే.. జూనియర్ ఎన్టీఆర్ ఇంతవరకూ ఎక్కడా ఎప్పుడూ తనకు ఓ పదవి కావాలని కానీ, అలాంటి ఆశ ఉన్నట్టు కానీ ఎక్కడా బయటపడలేదు. అలాగే టీడీపీ కాకుండా మరో పార్టీ మీద ఆసక్తి చూపుతున్న దాఖలాలు కూడా కనిపించలేదు. అలాంటప్పుడు ఆయన ఇంకే ఆకాంక్షలతో ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారనేది ఎంతకూ అంతుచిక్కడం లేదు. తారక్ కు తెలుగు భాషపై మంచి పట్టుంది. కాబట్టి ఆయన నర్మగర్భంగా మాట్లాడారని కొందరు, పరోక్ష హెచ్చరికలు పంపారని ఇంకొందరు భావిస్తున్నారు. అదేం కాదు తన మనసులో మాటను ప్రజలే అర్థం చేసుకోవాలనే కోణంలో జూనియర్ ఎన్టీఆర్ బాణం వదిలారనే చర్చ కూడా జురుగుతోంది. కానీ ప్రస్తుతానికి ఎవరెంత చర్చించుకున్నా.. అసలు విషయం ఏంటో బయటపడే అవకాశం లేదు. తారక్ తాననుకున్నప్పుడే చెప్పాల్సింది చెబుతారు తప్ప.. పబ్లిక్ డిమాండ్ మేరకు మాట్లాడటం ఆయనకు అలవాటు లేని పని.