కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా కళ్యాణ్ రామ్ సోదరుడు జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యారు. సరిగ్గా ట్రైలర్ లాంచ్ సమయానికి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్, ట్రైలర్ ఆన్ చేసి, త్వరగానే మాట్లాడే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ, “మళ్లీ ఎప్పుడు కనిపిస్తానో తెలియదు. ఒకసారి తనివితీరా మాట్లాడనివ్వండి. అభిమాన సోదరులందరికీ నా నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకు, మీడియా మిత్రులకు, ఇక్కడికి వచ్చిన ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ చిత్ర బృందం మొత్తానికి నా నమస్కారాలు.
ఈ వేదికపై చాలాసార్లు నేను, కళ్యాణ్ రామ్ నిలబడినప్పుడు, నాన్నగారు చాలాసార్లు వచ్చి మాట్లాడడం జరిగింది. ఈ రోజు మొట్టమొదటిసారిగా స్టేజ్‌పై నాన్నగారు లేరనే లోటు తీరినట్లు అయింది, విజయశాంతి గారు మాట్లాడుతూ ఉంటే. నాకు ఒక క్షణం, ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ చిత్రంలో నాన్నగారు ఉండి ఉంటే ఎలా ఉండేదో, అది ఈ రోజు విజయశాంతి గారు మాట్లాడినప్పుడు నాకు ఆ లోటు భర్తీ అయిన ఫీలింగ్ కలిగింది.
Jr NTR: మీరు ఇలాగే అరిస్తే నేను వెళ్లిపోతా!
విజయశాంతి గారు సాధించిన గొప్పతనం, ఏ మహిళా సాధించలేదు. కేవలం మన తెలుగు చలనచిత్ర సీమలోనే కాదు, భారతదేశ చిత్రపటంలో హీరోలతో సమానంగా నిలబడిన ఏకైక మహిళ ఎవరైనా ఉన్నారంటే, అది విజయశాంతి గారు ఒక్కరే. ‘కర్తవ్యం’ కావచ్చు, ‘ప్రతిఘటన’ కావచ్చు, ‘మగరాయుడు’ అనే సినిమా కావచ్చు, ఆవిడ చేసిన ఎన్నో సినిమాలు మీరు చూస్తే, ఆవిడ చేసిన అన్ని వైవిధ్యమైన పాత్రలు ఇంకెవరూ చేయలేదు. ఆ అదృష్టం ఆమె ఒక్కరికే దక్కింది. ఈ సినిమా ఆలోచన కూడా నాకు అనిపిస్తోంది, ‘కర్తవ్యం’ నుంచే ఆ పోలీస్ ఆఫీసర్‌కి ఒక కొడుకు పుడితే ఎలా ఉంటుందో, అక్కడ నుంచి మొదలై ఉండొచ్చు ఈ ఐడియా. కాబట్టి చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు ఇలాంటి మా అన్న సినిమా ఈవెంట్‌కి రావడం ఒక మంచి విషయం, ఎందుకంటే మీ అందరినీ కలుసుకునే అవకాశం దొరికింది.
కానీ ఈ సినిమాలో ఒక చిన్న ఉత్సాహం ఉంది, ఎందుకంటే ఈ చిత్రాన్ని నేను ఇప్పటికే చూశాను. విజయశాంతి గారు లేకపోతే ఈ చిత్రం లేదు. పృద్వి గారు లేకపోతే ఈ చిత్రం లేదు. సహాయం గారు లేకపోతే ఈ చిత్రం లేదు. ఈ చిత్రానికి ప్రదీప్ చిలుకూరి డైరెక్టర్ కాకపోతే ఈ చిత్రం లేదు. ఈ చిత్రానికి సునీల్, అశోక్ నిర్మాతలు కాకపోతే ఈ సినిమా లేదు. ఒక్కొక్కరూ ప్రాణం పెట్టి ఈ సినిమాని తీర్చిదిద్దారు.
ఆ రోజు సినిమా చూస్తున్నప్పుడు మాకు తెలుసు, వాళ్లు ఈ సినిమాని ఎంత నమ్మారో. 18వ తారీకు మీ అందరి ముందుకు రాబోతున్న ఈ చిత్రం, రాసి పెట్టుకోండి, ఆఖరి 20 నిమిషాలు మాత్రం థియేటర్‌లో కూర్చున్న ప్రతి ఒక్కరూ కళ్లలో నీళ్లు తిరగకపోతే నన్ను అడగండి.”
చివరగా, “ప్రతిసారి నేను చెబుతూ ఉంటాను, కాలర్ ఎక్కడ ఎగరేయమని? ఇప్పుడు అన్న, మీరు ఒకసారి కాలర్ ఎగరేయండి,” అంటూ కళ్యాణ్ రామ్‌ని జూనియర్ ఎన్టీఆర్ ఉత్సాహపరిచారు. కాళ్యాణ్ రామ్ వద్దు అనడంతో ఎన్టీఆరే స్వయంగా కాలర్ ఎగరేశాడు.