Jayam Ravi: జయం రవి వ్యక్తిగత వివాదం ఎఫెక్ట్..నిర్మాతల్లో పెరిగిన ఆందోళన

Jayam Ravi

Jayam Ravi

‘పొన్నియిన్ సెల్వన్’, ‘తని ఒరువన్’ (తెలుగులో ధ్రువ) చిత్రాలతో భారీ క్రేజ్ తెచ్చుకున్న జయం రవి.. గత కొంతకాలంగా వ్యక్తిగత జీవితంలో మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో  తాజాగా చెన్నైలో అత్యవసరంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కన్నీళ్లు పెట్టుకుంటూ.. లీగల్‌గా విడాకుల ప్రక్రియ ముగిసి, తన వ్యక్తిగత జీవితం కుదుటపడే వరకు సినిమాల్లో నటించనని, తన సినిమాల రిలీజ్‌లను కూడా నిలిపివేయాలని కోరుతున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు.

‘గత 23 ఏళ్లుగా నేను రాత్రింబగళ్లు కష్టపడి పనిచేశాను. నా కెరీర్‌లో 90 శాతం సినిమాలు విజయవంతమయ్యాయి. కానీ గత రెండేళ్లుగా నా వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న దుష్ప్రచారం నా మానసిక ప్రశాంతతను పూర్తిగా దెబ్బతీశాయి. చట్టబద్ధంగా నా విడాకులు పూర్తయ్యే వరకు నేను నటించలేను, నా వల్ల కావడం లేదు’ అని తెలిపారు. జయం రవి ఆకస్మికంగా నటనకు బ్రేక్ చెప్పడం విడాకుల తీర్పు వచ్చే వరకు సినిమాలను హోల్డ్‌లో పెట్టాలని పట్టుబట్టడం తమిళ బాక్సాఫీస్‌పై భారీ ప్రభావాన్ని చూపించనుంది. ఆయన నటిస్తున్న దాదాపు రూ.150 కోట్లకు పైగా బడ్జెట్ ఉన్న క్రేజీ సినిమాలు ఇప్పుడు అటకెక్కే పరిస్థితి వచ్చింది.

ముఖ్యంగా కృతి శెట్టి, కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఫాంటసీ డ్రామా ‘జీనీ’, అలాగే టాలీవుడ్ ఆడియన్స్ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్న మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ ‘తని ఒరువన్ 2’ ల భవిష్యత్తు ఇప్పుడు పూర్తిగా ప్రశ్నార్థకంగా మారింది. ఈ వివాదం తేలే వరకు జయం రవి సినిమాల ప్రమోషన్లలో కూడా పాల్గొననని స్పష్టం చేయడంతో టెక్నీషియన్లు, డిస్ట్రిబ్యూటర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.