తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రధాన విభాగాల్లో ఒకటైన తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA) నూతన అధ్యాయాన్ని ప్రారంభించింది. ప్రఖ్యాత కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సతీమణి శ్రీమతి వి.వి. సుమలతా దేవి అసోసియేషన్ అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికై, గురువారం హైదరాబాద్‌లో ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ అసోసియేషన్‌కు అధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. ఈ వేడుకకు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, శ్రీశైలం యాదవ్, ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ మరియు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
Also Read:SS Thaman: అఖండ తాండవం కోసం టెక్నాలజీని నమ్మలేదు.. శివాలజీని నమ్మం
ప్రమాణ స్వీకారోత్సవంలో జానీ మాస్టర్ మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. సభ్యుల సంక్షేమం కోసం తమకున్న భారీ ప్రణాళికలను ఆయన వెల్లడించారు: యూనియన్‌లోని ప్రతి ఒక్కరికీ ఆరోగ్య భీమా ఉండాలన్న లక్ష్యంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారిని సంప్రదించగా, ఆయన వెంటనే ఆర్థిక సాయం అందించారని తెలిపారు. ఒక సభ్యుడు యూనియన్ నుండి రిటైర్ అయ్యేటప్పుడు సుమారు ₹10 నుండి ₹15 లక్షల వరకు ఆర్థిక భరోసా కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. డ్యాన్సర్లకు సొంత స్థలాలు వచ్చేలా కృషి చేస్తామని హామీ ఇచ్చిన శ్రీశైలం యాదవ్, నవీన్ యాదవ్ కుటుంబానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Also Read:
ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మాట్లాడుతూ, మహిళా నాయకత్వంలో యూనియన్ కొత్త పుంతలు తొక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. డ్యాన్సర్ల కష్టసుఖాల్లో తన కుటుంబం ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
శ్రీశైలం యాదవ్ మరియు సి. కళ్యాణ్ మాట్లాడుతూ.. యూనియన్‌లో ఉండే చిన్న చిన్న సమస్యలను అంతర్గతంగానే పరిష్కరించుకోవాలని, కోర్టులు, కేసుల చుట్టూ తిరిగి ఇండస్ట్రీ పరువు తీయవద్దని హితవు పలికారు. సుమలత విజయం ఇండస్ట్రీలోని మహిళా కళాకారులకు స్ఫూర్తినిస్తుందని కొనియాడారు.
సుమలతా దేవితో పాటు పలువురు సభ్యులు కార్యవర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన కార్యదర్శి కె. శ్రీనివాసరావు, కోశాధికారి: పి. చిరంజీవి కుమార్, ఉపాధ్యక్షులు: కె. సురేష్, యమ్. రాజు, కమిటీ సభ్యులు: కె. సతీష్ గౌడ్, కె. శ్రీదేవి, పి. సురేష్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్, కార్యదర్శి దామోదర్ ప్రసాద్, ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ కుమార్ వల్లభనేని తదితర సినీ ప్రముఖులు పాల్గొని నూతన బాడీకి శుభాకాంక్షలు తెలిపారు. తనపై నమ్మకంతో ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ సుమలతా దేవి ధన్యవాదాలు తెలుపుతూ, సమస్యల పరిష్కారమే తన ప్రధమ కర్తవ్యమని ప్రకటించారు.