మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ డైరెక్టర్ శివ కాంబినేషన్‌లో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వచ్చిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. ఎమోషనల్ అండ్ డివోషనల్ టచ్‌తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తూనే, కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఏర్పాటు చేసిన ‘థాంక్యూ మీట్’లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ ఎమోషనల్ అయ్యారు. సినిమా సక్సెస్ పట్ల ఆనందం వ్యక్తం చేస్తూనే, సినిమా చూసి తాను ఎంతలా భావోద్వేగానికి గురయ్యానో వివరిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.
తన కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన సినిమాలు నిర్మించామని, చూశామని చెప్పిన రవి.. ఏ సినిమాకూ తానింతలా ఎమోషనల్ కాలేదన్నారు. “ఫస్ట్ కాపీ చూసినప్పుడు, ప్రీమియర్ షో రోజు ఫ్యామిలీతో కలిసి చూసినప్పుడు ఎంతలా ఏడ్చేశామో మాటల్లో చెప్పలేను. ఇప్పుడు ఆ ఇంపాక్ట్ ఎంతలా ఉందంటే.. ఫోన్లో ఇరుముడికి సంబంధించిన రీల్స్ చూసినా, ఎవరైనా ఎమోషనల్ మెసేజ్ పెట్టినా కన్నీళ్లు వచ్చేస్తున్నాయి. ఇదొక వీక్‌నెస్ లేదా ఎడిక్షన్‌లా మారిపోయింది. ఒక సినిమా ఇంతలా ప్రభావితం చేయడం ఏంటి అనేది ఒక కేస్ స్టడీలా పరిశోధించాలి” అంటూ రవి చెప్పుకొచ్చారు. సినిమాకు వస్తున్న ఆదరణ గురించి చెబుతూ ఓ ఆసక్తికరమైన విషయాన్ని ఆయన పంచుకున్నారు. “ఒక 80 ఏళ్ల బామ్మ, తన 84 ఏళ్ల భర్తతో కలిసి సినిమా చూడాలని ఇద్దరు మనుషుల సాయంతో థియేటర్ల చుట్టూ తిరిగారు. నాలుగు షోలు ట్రై చేస్తే కానీ వారికి టికెట్లు దొరకలేదు. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం నాగార్జున ‘అన్నమయ్య’ సినిమాకు థియేటర్‌కు వెళ్లామని, మళ్లీ ఇప్పుడు ఇరుముడి కోసం వచ్చామని వారు చెప్పడం చాలా ఆనందాన్నిచ్చింది. ఈ సినిమాకు వయసుతో సంబంధం లేకుండా బ్యారియర్స్ అన్నీ బద్దలైపోయాయి,” అని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
సాంకేతిక నిపుణుల పనితీరుపై ప్రశంసల వర్షం కురిపించిన రవి.. నేషనల్ అవార్డుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఆర్ట్ డైరెక్టర్ సాయి సురేష్ వేసిన సెట్స్ ఎంత నేచురల్‌గా ఉన్నాయంటే.. అవార్డు కమిటీ వాళ్లు సైతం అవి రియల్ లొకేషన్స్ అనుకుని అవార్డులు ఇవ్వరేమో అన్న భయం వేస్తోంది. అందుకే ఈసారి అవార్డుల నామినేషన్స్ అప్పుడు ఏది సీజీ, ఏది ఒరిజినల్ సెట్ అనేది క్లియర్‌గా పంపిస్తాం. ఈ సినిమాకు కచ్చితంగా జాతీయ అవార్డులు వస్తాయి. ముఖ్యంగా హీరో రవితేజ, హీరోయిన్, చైల్డ్ ఆర్టిస్ట్, డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, ఆర్ట్ డిపార్ట్‌మెంట్లకు కచ్చితంగా అవార్డులు దక్కుతాయి,” అని ధీమా వ్యక్తం చేశారు. అయ్యప్ప స్వామి దయతో హీరో రవితేజకు పెద్ద హిట్ వచ్చిందని, రవితేజ తమకు హిట్ ఇచ్చారని, తాము ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాను అందించామని రవి అన్నారు. ఇదొక చైన్ రియాక్షన్‌లా జరిగిపోయిందన్నారు. కథ వినగానే కన్విన్స్ అయిపోయి అద్భుతమైన పాత్ర పోషించిన సీనియర్ నటుడు సాయికుమార్‌కు, అలాగే ప్రమోషన్స్ కోసం ఏకంగా ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ప్రియకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అసలు సాయికుమార్ భార్య పాత్రకు తీసుకున్న నటి ఎవరో కూడా తెలియదని, అంత రియలిస్టిక్‌గా కాస్టింగ్ చేసి, సినిమాను డైరెక్టర్ శివ ఓ మ్యాజిక్‌లా మలిచారని రవి ప్రశంసించారు. మీడియా మిత్రులు సినిమాను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారని, మరో నాలుగు వారాల పాటు థియేటర్లలో ‘ఇరుముడి’ హవా గట్టిగా ఉంటుందని ఆయన కుండబద్దలు కొట్టారు.

