టాలీవుడ్లో చైల్డ్ ఆర్టిస్టులతో పని చేయించుకునే వ్యవహారంపై తెలంగాణ కార్మిక శాఖ సీరియస్ యాక్షన్‌కు దిగింది. తాజాగా ‘ఇరుముడి’ సినిమా నిర్మాతలకు లేబర్ డిపార్ట్మెంట్ ఊహించని షాక్ ఇస్తూ సంచలన నోటీసులు జారీ చేసింది. ఈ సినిమా షూటింగ్‌తో పాటు, ప్రమోషనల్ ఈవెంట్స్‌లో ఒక మైనర్ బాలికను విరివిగా వాడుకోవడంపై అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమాల్లో చిన్న పిల్లలతో నటించేటప్పుడు పాటించాల్సిన బాల కార్మిక చట్టాలను ఉల్లంఘించారనే అనుమానంతో అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ‘ఇరుముడి’ నిర్మాతలు ఆ చిన్నారితో షూటింగ్ చేయడానికి ముందు జిల్లా మేజిస్ట్రేట్ నుంచి అధికారిక అనుమతి తీసుకున్నారా? లేదా? అని నోటీసుల్లో నిలదీశారు. అన్నింటికంటే ముఖ్యంగా సెన్సేషనల్ పాయింట్ ఏంటంటే.. చట్టప్రకారం ఆ చిన్నారికి చెల్లించిన రెమ్యునరేషన్లో 20 శాతం మొత్తాన్ని ఆమె పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేశారా? లేదా? అన్న వివరాలు వెంటనే సమర్పించాలని ఆదేశించారు.
కేవలం ఆర్థిక పరమైన విషయాలే కాకుండా.. సెట్స్‌లో ఆ బాలిక పని వేళలు ఎలా ఉన్నాయి? షూటింగ్ వల్ల ఆమె చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా మేకర్స్ ఏం చర్యలు తీసుకున్నారు? అసలు తల్లిదండ్రుల నుంచి అధికారికంగా లిఖితపూర్వక అనుమతి ఉందా? తదితర సున్నితమైన అంశాలపై లేబర్ డిపార్ట్మెంట్ ఆరా తీసింది. ఈ మొత్తం వివాదంపై సరైన ఆధారాలతో వివరణ ఇచ్చేందుకు నవంబర్ 4వ తేదీ ఉదయం 11 గంటలకు తమ ఎదుట విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని ‘ఇరుముడి’ నిర్మాతలకు అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ నిబంధనలు పాటించలేదని విచారణలో తేలితే మాత్రం నిర్మాతలు కఠినమైన చట్టపరమైన చిక్కులు ఎదుర్కోక తప్పదు. ఒక సినిమా ప్రమోషన్స్ కోసం చైల్డ్ ఆర్టిస్ట్‌ను వాడుకుని నోటీసులు అందుకున్న ఈ వ్యవహారం ఇప్పుడు ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

