‘వేర్ ఈజ్ వరుణ్ సందేశ్?’ అంటూ రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలో ‘ఇందువదన’ చిత్ర బృదం ఓ వీడియోను విడుదల చేసింది. వరుణ్ సందేశ్ కొత్త సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ త్వరలోనే విడుదల చేస్తామని అందులో చెప్పింది. దానికి తగ్గట్టుగా సోమవారం ఉదయం ‘ఇందువదన’ పోస్టర్ ను విడుదల చేశారు. విశేషం ఏమంటే… ఈ బోల్డ్ పోస్టర్ విడుదల అయ్యీ కాగానే సోషల్ మీడియాలో వైరల్ కావడం మొదలైంది. షర్ట్ లేకుండా వరుణ్ సందేశ్, అతి తక్కువ దుస్తులు ధరించిన ఓ అమ్మాయిని కౌగలించుకుని ఉన్న ఈ పోస్టర్ ను చూడగానే కుర్రకారు ‘వావ్’ అంటున్నారు. ఎంఎస్ఆర్ దర్శకత్వంలో మాధవి ఆదుర్తి నిర్మిస్తున్న ‘ఇందువదన’లో వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి జంటగా నటిస్తుననారు. కొంతకాలం గ్యాప్ తర్వాత వరుణ్ సందేశ్ ఈ మూవీతో రీ-ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు సతీశ్ ఆకేటి అందిస్తుండగా, శివ కాకాని స్వర రచన చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని దర్శక నిర్మాతలు అంటున్నారు.