Dancers Association: డాన్సర్స్ యూనియన్ ఎన్నికలపై హైకోర్టు స్టే!

Tollywood

Tollywood

టాలీవుడ్‌లో కార్మిక సంఘాల రాజకీయం ఒక్కసారిగా భగ్గుమంది. తెలుగు ఫిలిం & టీవీ డాన్సర్స్ & డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఎన్నికల నిర్వహణపై తీవ్ర సంచలనం రేగింది. ఫిలిం ఫెడరేషన్ నేతృత్వంలో జోరుగా సాగుతున్న ఎన్నికల హడావుడికి తెలంగాణ హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. వివాదాస్పదంగా మారిన ఈ ఎన్నికల ప్రక్రియపై న్యాయస్థానం స్టే ఆర్డర్ (CRP No. 3123/26) జారీ చేయడంతో చిత్రపురి వర్గాల్లో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ ఎన్నికలను ఎలాగైనా పూర్తి చేయాలని భావించినప్పటికీ, అంతర్గత విభేదాలు, అభ్యంతరాల నడుమ వ్యవహారం కోర్టు మెట్లెక్కినట్లు సమాచారం. హైకోర్టు తాజా ఆదేశాలతో మొత్తం పోలింగ్ ప్రక్రియ అర్ధాంతరంగా నిలిచిపోయింది.

ఈ పరిణామంపై స్పందించిన అసోసియేషన్ ప్రతినిధులు, కోర్టు ఉత్తర్వులను గౌరవిస్తూ ఎన్నికలను తక్షణమే నిలిపివేస్తున్నట్లు ఫెడరేషన్‌కు అధికారికంగా లేఖ రాశారు. త్వరలోనే కోర్టు పూర్తి ఆర్డర్ కాపీని ఫెడరేషన్‌కు అందజేయనున్నట్లు స్పష్టం చేశారు. ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధమైన అభ్యర్థులకు, డాన్సర్స్ యూనియన్‌ను తమ గుప్పిట్లో ఉంచుకోవాలని చూసిన పెద్దలకు ఈ స్టే ఆర్డర్ మింగుడుపడని పరిణామంగా మారింది. కోర్టు తదుపరి విచారణలో ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది? అసోసియేషన్ వివాదం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందనేది ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.