తమిళంలో శ్రీకాంత్ పేరుతో నటుడిగా చక్కని గుర్తింపు తెచ్చుకున్న శ్రీరామ్ ప్రస్తుతం తెలుగులో ‘టెన్త్ క్లాస్ డైరీస్’ మూవీలో హీరోగా నటించాడు. అవికాగోర్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని అచ్యుత రామారావు, రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మించారు. ఈ ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ తో సినిమాటోగ్రాఫర్ అంజి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ మూవీ జూన్ 24న విడుదల కాబోతోంది.
గతంలో దర్శకులుగా మారిన సినిమాటోగ్రాఫర్స్ తో పనిచేసిన అనుభవం గురించి శ్రీరామ్ చెబుతూ, ‘ప్రముఖ తెలుగు సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘ఒకరికి ఒకరు’లో తానే హీరోగా నటించానని, అలానే ప్రముఖ తమిళ సినిమాటోగ్రాఫర్ స్వర్గీయ కేవీ ఆనంద్ దర్శకత్వం వహించిన ఫస్ట్ సినిమా ‘కన కండేన్’ (తెలుగులో ‘కర్తవ్యం’గా డబ్ అయ్యింది) మూవీలోనూ తానే కథానాయకుడినని, ఇప్పుడు సినిమాటోగ్రాఫర్ అంజి దర్శకత్వం వహిస్తున్న ‘టెన్త్ క్లాస్ డైరీస్’లో హీరోగా నటించడం ఆనందంగా ఉంద’ని అన్నారు. అంజితో గతంలోనే తమిళంలో ఓ సినిమా చేయాల్సి ఉందని అప్పుడు కుదరలేదని, ఆ పరిచయం తోనే ఇప్పుడీ మూవీ చేశానని శ్రీరామ్ చెప్పారు. రీ-యూనియన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు గతంలో వచ్చిన ఈ తరహా చిత్రాలు ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్’, ‘జాను’కు సంబంధం ఉండదని, అయితే కొన్ని సన్నివేశాలలో కంపారిజన్ రావచ్చునని అన్నారు. ఇందులో అవికాగోర్ చాందిని అనే పాత్రను పోషించిందని ఆమెను అన్వేషించడమే ఈ సినిమా అని, ఇందులో శివబాలాజీ, మధుమిత భార్యాభర్తలుగా నటించారని శ్రీరామ్ అన్నారు.
సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న ‘రావణాసుర’లో ఓ కీలక పాత్ర పోషిస్తున్నానని, తమిళంలో ఆరు చిత్రాలలో నటిస్తున్నానని, అలానే తాను నటించిన ‘రెక్కీ’ వెబ్ సీరిస్ ఈ నెల 17 నుండి జీ 5లో స్ట్రీమింగ్ కాబోతోందని శ్రీరామ్ చెప్పారు.