భారతీయ సినీ చరిత్రలోనే బహుశా ఇలాంటి విచిత్రమైన పరిణామం ఎప్పుడూ జరిగి ఉండదు! బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించి, పాన్-ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన ‘హను-మాన్’ ఫ్రాంచైజీ ఇప్పుడు ఏకంగా రెండు వేర్వేరు ట్రాక్‌లుగా విడిపోయింది. ఒకే బ్లాక్‌బస్టర్ సినిమాకు.. ఇటు దర్శకుడు ఒక సీక్వెల్, అటు నిర్మాతలు మరో సీక్వెల్ తీస్తుండటం ఇప్పుడు టాలీవుడ్ ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్‌గా మారింది. ‘హను-మాన్’ వంటి భారీ విజయం తర్వాత దర్శకుడు ప్రశాంత్ వర్మ, ఒరిజినల్ నిర్మాతలైన ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ తలెత్తగా ప్రశాంత్ వర్మ ఆ బ్యానర్ నుంచి బయటకు వచ్చి, టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌తో చేతులు కలిపారు. కన్నడ స్టార్ రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో ‘జై హనుమాన్’ చిత్రాన్ని పట్టాలెక్కించి తన సినిమాటిక్ యూనివర్స్‌ను ముందుకు తీసుకెళ్తున్నారు.
దర్శకుడు వెళ్లిపోయినా సరే, ‘హను-మాన్’ లెగసీని వదిలే ప్రసక్తే లేదంటూ ఒరిజినల్ నిర్మాతలు కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి (ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్) ఓ భారీ సంచలనానికి తెరలేపారు. తాజాగా తమ తదుపరి భారీ, యాంబిషియస్ ప్రాజెక్ట్ ‘హను-మాన్ 2 – ది రైజ్ ఆఫ్ వానరాస్’ (#HanuMan2 – The Rise of Vanaras) అధికారికంగా ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. ఈ సీక్వెల్ కోసం మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్‌ను రంగంలోకి దించగా, ఫాంటసీ, థ్రిల్లర్ కథలను అద్భుతంగా తెరకెక్కించే దర్శకుడు విఐ ఆనంద్ కు దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. వైష్ణవ్ తేజ్ × విఐ ఆనంద్ × ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు మొదలయ్యాయి. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని ఆసక్తికర వివరాలను వెల్లడిస్తామని మేకర్స్ ప్రకటించారు. మొత్తానికి ఒకే ఫ్రాంచైజీ నుంచి రెండు వేర్వేరు సీక్వెల్స్, ఇద్దరు వేర్వేరు దర్శకులు, ఇద్దరు వేర్వేరు హీరోలతో పోటాపోటీగా రాబోతుండటం సినీ అభిమానుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ వద్ద ఈ రెండు చిత్రాలు ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాయో చూడాలి!

