Hanuman 2 : వివాదానికి తెరలేపనున్న హనుమాన్ 2 ప్రకటన?

Hanuman 2 Teja Sajja

Hanuman 2 Teja Sajja

పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన ‘హనుమాన్’ సినిమాకు సీక్వెల్‌గా ‘హనుమాన్ 2’ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ తాజాగా ప్రకటించి టాలీవుడ్‌లో ఒక్కసారిగా కలకలం రేపింది. అయితే, ఈ ప్రకటన వెనుక ఒక పెద్ద వివాదం దాగి ఉందనే వార్తలు ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
సాధారణంగా ఒక హిట్ సినిమాకు సీక్వెల్ తీసేటప్పుడు హీరో, దర్శకుడు మారడం ఇండస్ట్రీలో కొత్తేమీ కాదు. కానీ ఇక్కడ అసలు కథ వేరే ఉంది. ఈ ప్రాజెక్టులో హీరోగా పంజా వైష్ణవ్ తేజ్, దర్శకుడిగా విఐ ఆనంద్ పేర్లను నిర్మాత నిరంజన్ రెడ్డి ప్రకటించారు. అయితే, అసలు ‘హనుమాన్’ సిరీస్ ఇంట్లెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ (IP Rights) మొదటి నుంచీ దర్శకుడు ప్రశాంత్ వర్మ వద్దే ఉన్నాయి. హక్కులు లేకుండానే నిరంజన్ రెడ్డి ఈ సీక్వెల్‌ను ఎలా ప్రకటించారన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

‘హనుమాన్’ విడుదలైన తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డికి, హీరో తేజ సజ్జా, దర్శకుడు ప్రశాంత్ వర్మకు మధ్య విభేదాలు తలెత్తినట్లు సమాచారం. దీంతో తేజ సజ్జా తన తదుపరి సినిమాలపై దృష్టి పెట్టగా, ప్రశాంత్ వర్మ తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘జై హనుమాన్’ను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో, రిషబ్ శెట్టి హీరోగా దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యారు. ఆ సమయంలో నిరంజన్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. తన వద్ద అడ్వాన్స్ తీసుకున్న ప్రశాంత్ వర్మ, వేరే బ్యానర్‌లో సినిమా చేయడానికి వీల్లేదని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే, ఆ మొత్తం తన పాత బకాయిల్లో భాగమే తప్ప, కొత్త సినిమా అడ్వాన్స్ కాదని ప్రశాంత్ వర్మ వాదించారు. ప్రతిష్టాత్మకమైన ‘జై హనుమాన్’ ప్రాజెక్టుకు ఎలాంటి ఆటంకాలు కలగకూడదనే ఉద్దేశంతో మైత్రీ మూవీ మేకర్స్ రంగంలోకి దిగి ఈ వివాదాన్ని సెటిల్ చేసింది. నిరంజన్ రెడ్డికి 23 కోట్ల రూపాయలు చెల్లించడంతో పాటు, ప్రైమ్ షో బ్యానర్‌లో ప్రశాంత్ వర్మ రూపొందిస్తున్న ‘ఆక్టోపస్’ సినిమాను కూడా తామే టేకోవర్ చేసేలా ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ సెటిల్‌మెంట్ ప్రకారం, ‘హనుమాన్’ సిరీస్‌కు సంబంధించి ఎలాంటి ప్రాజెక్టులు చేపట్టే అధికారం ప్రైమ్ షో సంస్థకు లేదు. కానీ, అనూహ్యంగా ఇప్పుడు ‘హనుమాన్ 2’ ప్రకటన రావడం ఇండస్ట్రీ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. ఈ వ్యవహారంపై మైత్రీ మూవీ మేకర్స్, ప్రశాంత్ వర్మ మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించి సినిమాను అడ్డుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదంతా ఇలా ఉంటే, అసలు ఈ వివాదం గురించి తెలిసి కూడా వైష్ణవ్ తేజ్, దర్శకుడు విఐ ఆనంద్ ఈ ప్రాజెక్టులోకి ఎలా అడుగుపెట్టారన్నది ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ ‘హనుమాన్ 2’ వివాదం మున్ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి!