అందమైన అమ్మాయిలను పూలతో పోల్చుతుంటారు కవులు. అందుకేనేమో పూలను తుంచి జడలో పెట్టుకోవడం కంటే… కంటికి ఎదురుగా కలర్ ఫుల్ గా ఉంచుకోవడానికి కొందరమ్మాయిలు ఇష్టపడుతుంటారు. ప్రముఖ కథానాయిక హన్సిక మోత్వాని కూడా అదే కోవకు చెందింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా మరోసారి షూటింగ్స్ బంద్ కావడంతో హన్సిక పూల మొక్కల పెంపకంపైకి తన దృష్టిని మరల్చింది. లాక్ డౌన్ టైమ్ లో తన రొటీన్ ఏమిటనేది హన్సికా సోషల్ మీడియా ద్వారా చెప్పకనే చెప్పింది. రకరకాల రంగుల పూల మొక్కలను తీసుకుని, వాటి కాడలను తగినంత మేరకు కత్తిరించి, ఫ్రెష్ వాటర్ గ్లాస్ లో పెట్టింది. కలర్ ఫుల్ గా ఉండే హన్సిక చేతుల్లోకి తీసుకున్న ఆ పూలు సైతం రంగురంగులవి కావడంతో ఆ ఫ్రేమ్ మొత్తం మరింత అందంగా మారిపోయింది. పువ్వులకు హన్సిక ఇచ్చే ప్రాధాన్యం తెలుసుకోవాలంటే.. ఆమె ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లోని హైలైట్స్ సెక్షన్ ను చూస్తే అర్థమైపోతుంది.
ఇదిలా ఉంటే… చూస్తుండగానే హన్సిక నటిగా యాభైవ మైలు రాయికి చేరువైపోయింది. శింబుతో కలిసి హన్సిక తన 50వ చిత్రం ‘మహా’లో నటిస్తోంది. కాషాయంబరధారిగా ఓ కుర్చీపై కూర్చుని హుక్కా పీలుస్తున్నట్టుగా వచ్చిన హన్సిక ఫస్ట్ లుక్ పోస్టర్ అప్పట్లో వివాదాలకు తెరలేపింది. అంతేకాదు… ఇప్పుడు సినిమా విడుదల సమయంలోనూ దర్శకుడు యు. ఆర్. జమీల్ కు నిర్మాతలకు మధ్య పొరపొచ్చలు వచ్చినట్టు తెలుస్తోంది. తన ప్రమేయంలేకుండా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను నిర్వహించడాన్ని ప్రశ్నిస్తూ ఆ మధ్య జమీల్ కోర్టును ఆశ్రయించాడు. అయితే… షూటింగ్ ఇప్పటికే పూర్తయిపోయిందని, తొలి కాపీ రాగానే థియేటర్ లేదా ఓటీటీలో విడుదల చేస్తామని నిర్మాతలు చెబుతున్నారు. కోర్టు సైతం జమీల్ వాదనను త్రోసిపుచ్చి, వీలును బట్టి సినిమాను విడుదల చేసుకునే హక్కును నిర్మాతలకు ఇచ్చిందట.