Ram Charan : ఇలాంటి అద్భుతమైన కథ దొరికినప్పుడు కష్టపడకపోతే ఇంకెప్పుడు కష్టపడతాం?

Ram Charan Speech

Ram Charan Speech

విజయవాడ వేదికగా జరిగిన ‘పెద్ది’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ థియేటర్లలోకి రాకముందే సక్సెస్ సెలబ్రేషన్స్‌ను తలపించిందన్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. తన సినీ కెరీర్‌లోనే ‘పెద్ది’ ఒక మైలురాయిగా నిలిచిపోతుందని చరణ్ ధీమా వ్యక్తం చేశారు. ఒక నటుడిగా కెరీర్‌లో ఎన్నో కథలు వింటూ ఉంటామని, కొన్ని నచ్చుతాయని, మరికొన్ని ఆశ్చర్యపరుస్తాయని.. కానీ ‘పెద్ది’ కథ విన్నప్పుడు మాత్రం అది నేరుగా తన హృదయాన్ని హత్తుకుందని రామ్ చరణ్ చెప్పారు. ఇలాంటి కథలు చిత్ర పరిశ్రమలోకి పదేళ్లకు ఒకసారి మాత్రమే వస్తాయని, తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి కూడా ఇదే మాట అన్నారని ఆయన గుర్తుచేసుకున్నారు. ఇంతటి గొప్ప సబ్జెక్టును తన ముందుకు తెచ్చినందుకు దర్శకుడు బుచ్చిబాబు సానాకు, ఆయన గురువు సుకుమార్‌కు చరణ్ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. లైఫ్ లాంగ్ తన పర్సనల్ మూవీ లైబ్రరీలో ‘పెద్ది’ ఎప్పటికీ టాప్-3 సినిమాల్లో ఒకటిగా నిలిచిపోతుందని స్పష్టం చేశారు.

“బుచ్చిబాబు నాకు ఈ కథను ఒక సినిమా స్క్రిప్ట్‌లా చెప్పలేదు. ఒక మనిషి జీవిత ప్రయాణాన్ని నా కళ్లకు కట్టాడు. ఇది ఏదో పైపైకి ఎగిసిపడే వ్యక్తి కథ కాదు.. అట్టడుగుకి పడిపోయిన ఒక సాధారణ మనిషి, తిరిగి లేచి ఎలా నిలబడ్డాడు, ఎలా పోరాడాడు అనేదే ఈ సినిమా” అని చరణ్ వివరించారు. ఈ సినిమా కోసం పడ్డ శ్రమ గురించి అందరూ మాట్లాడుతుంటే.. “ఇలాంటి అద్భుతమైన కథ దొరికినప్పుడు కష్టపడకపోతే ఇంకెప్పుడు కష్టపడతాం? ఇది కష్టంతో చేసిన పని కాదు.. ఇష్టంతో, అమితమైన ప్రేమతో చేసిన ప్రయాణం. ప్రతిరోజూ ఉదయాన్నే లేచి ఎప్పుడెప్పుడు షూటింగ్‌కి వెళ్దామా అనిపించేలా చేసిన సినిమా ఇది” అని మెగా పవర్ స్టార్ పేర్కొన్నారు. గతంలో మగధీర, రంగస్థలం, RRR చిత్రాల షూటింగ్ సమయంలో మాత్రమే తనకు ఇలాంటి ఫీలింగ్ కలిగిందని, మళ్లీ ఇన్నాళ్లకు ‘పెద్ది’ ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేసిందని అనడంతో ఫ్యాన్స్ కేరింతలు కొట్టారు.

×
×
Ad