Film Chamber Releases a letter on Gaddar Awards: తెలుగు చిత్ర పరిశ్రమ తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. గద్దర్ అవార్డులపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి స్పందన లేకపోవడం పట్ల ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేస్తూ సినీ పరిశ్రమ పెద్దల నుంచి ఎలాంటి స్పందన లేకపోవటం బాధాకరం’’ అని వ్యాఖ్యానించారు. ప్రముఖ తమిళ రచయిత, ఉద్యమకారుడు శివశంకరికి ‘విశ్వంభర డాక్టర్ సి. నారాయణరెడ్డి జాతీయ సాహిత్య పురస్కారం’ ప్రదానం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ కామెంట్స్ చేశారు. ఇక ఇప్పటికే ఈ అంశం మీద చిరంజీవి స్పందించగా ఇప్పుడు ఫిలిం ఛాంబర్ కూడా స్పందించింది.
ఈ మేరకు ఒక లేఖ రిలీజ్ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఫిలిం ఇండస్ట్రీ అభివృద్ధికి తోడ్పడుతున్న రేవంత్ రెడ్డికి, సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేయుచున్నామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిని కలిసి ఫిలిం ఇండస్ట్రీకి చెందిన విషయాల గురించి వివరంగా చర్చించిన మీద ఎన్నో సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉన్న అవార్డ్స్ ను “గద్దర్ అవార్డ్స్” పేరు మీద ఇక నుండి ప్రతి సంవత్సరం అవార్డ్స్ ఇవ్వగలమని తెలియచేయగా ఫిలిం ఇండస్ట్రీ వారు తమ ఆనందాన్ని వ్యక్త పరిచారని అన్నారు. ఈ విషయం మీద తెలంగాణ రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారితో అవార్డ్స్ కు సంబంధించిన కమిటీ గురించి చర్చించడం జరిగిందని, దీని మీద తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి మరియు తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి వారు ఒక కమిటీ ని నియమించి సదరు విధి విధానాలను తయారు చేసి, ఆ విధి విధానాలను తెలంగాణ రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ద్వారా రేవంత్ రెడ్డికి అతి త్వరలో అందజేయడం జరుగుతుందని తెలియచేయుచున్నామని అంటూ లేఖ రిలీజ్ చేశారు.