తమిళ, మలయాళ భాషల్లో నటిగా చక్కని పేరు తెచ్చుకుంది సుమతీ జోసఫ్ ఉరఫ్ రేఖ. 1986లో సత్యరాజ్ సరసన రేఖ నటించిన ‘కడలోర కవితగళ్’ చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో ఇక ఆమె వెనుదిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి రాలేదు. ఆ తర్వాత కొన్ని తెలుగు, కన్నడ చిత్రాలలోనూ నటించింది రేఖ. తమిళంలో అయితే దాదాపు అగ్ర కథానాయకులందరి చిత్రాలలోనూ చేసింది. కొన్నేళ్ళ క్రితం నటనకు విరామం చెప్పి విజయ్ టీవీలో రియాలిటీ షోస్, కుక్ విత్ క్లౌన్ వంటి కార్యక్రమాలు చేసింది. అలానే బిగ్ బాస్ షో లోనూ పాల్గొంది. కాలక్షేపం కోసం సొంత యూట్యూబ్ ఛానెల్ పెట్టుకున్న రేఖ, తన మనసుకు నచ్చిన పనిచేస్తూ, వాటిని యూ ట్యూబ్ ఛానెల్ లో అప్ లోడ్ చేస్తుంటుంది.
Read Also : బాలీవుడ్ పై ప్రభుత్వం దృష్టి! కాశ్మీర్ వైపు బాలీవుడ్ చూపులు…
విశేషం ఏమంటే… నటిగా ఎప్పుడూ ఆమెకు అమ్మవారి పాత్రలు పోషించే ఛాన్స్ రాకపోవడంతో ఈ ఆషాడ మాసం ఆ కోరికను రేఖ తీర్చుకుంది. సహజంగా మనకు అమ్మవారి పాత్ర అనగానే అలనాటి మేటినటి కె. ఆర్. విజయ, ఆ మధ్య ఆ తరహా పాత్రలు పోషించిన రమ్యకృష్ణ గుర్తొస్తారు. ఇక గత యేడాది నయనతార సైతం ‘అమ్మోరు తల్లి’లో ముక్కుపుడక అమ్మవారిగా నటించి మెప్పించింది. వారికి ఏ మాత్రం తగ్గకుండా అద్భుతమైన వేషధారణతో అమ్మవారిగా అలరించింది అలనాటి నటి రేఖ. అమ్మవారి మేకప్ స్టిల్స్, వీడియోను రేఖ తన యూ ట్యూబ్ ఛానెల్ లో పెట్టడంతో సోషల్ మీడియాలో అవి వైరల్ అవుతున్నాయి. తోటి నటీనటులూ రేఖను అభినందనలతో ముంచెత్తుతున్నారు.