ముంబై బ్యూటీ కియారా అద్వానీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి నేటితో ఏడేళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భంగా అభిమానులు ఆమెకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అందులో భాగంగా కియారా అద్వానీ అభిమాని ఒకరు “మీకోసం సౌత్ ఎదురు చూస్తోంది. వీలైనంత త్వరగా ఇక్కడికి వచ్చేయండి… సౌత్ లో ఎక్కువ సినిమాలు చేయండి” అని కోరగా… అభిమాని ట్వీట్ కి స్పందించిన కియారా “లవ్ యు ఆల్… ఎగ్జైటింగ్ అనౌన్స్మెంట్ సూన్” అంటూ లవ్ ఎమోజిని షేర్ చేసింది.
దీంతో ఆ ఎగ్జైటింగ్ అనౌన్స్మెంట్ ఏంటో అనే ఆసక్తి మొదలైంది ఆమె అభిమానుల్లో. ఫగ్లీ అనే సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కియారా అద్వానికి ఆ సినిమా మంచి అవకాశాలు తెచ్చి పెట్టలేకపోయింది. ఆ తర్వాత ఆమె నటించిన ఎంఎస్ ధోనితో మంచి పేరు తెచ్చుకుంది. మెషిన్ అనే సినిమా లో నటించినప్పటికీ ఈ బ్యూటీకి ఆ చిత్రం అంతగా కలిసి రాలేదు.
మహేష్ బాబు సరసన ‘భరత్ అనే నేను’ సినిమాలో నటించి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. 2018 లో విడుదలైన ఈ చిత్రంతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. మొదటి చిత్రంతోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తర్వాత ఆమెకు రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’లో అవకాశం వచ్చింది. కానీ ఈ చిత్రం భారీ డిజాస్టర్ గా మిగిలింది. దీంతో ఆమెకు టాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు రాలేదు. కియారా కూడా బాలీవుడ్ సినిమాలపై దృష్టి పెట్టింది.
టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ లో నటించి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఈ హిట్ తో కియారా కెరీర్ టర్న్ అయ్యింది. బాలీవుడ్లో అవకాశాలు పెరిగాయి. ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగు బాలీవుడ్ చిత్రాలున్నాయి. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో కియారా నటించబోతోంది అంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమాలో హీరోయిన్ కియారనే అంటూ వార్తలు ప్రచారం అవుతున్నాయి. మరో వైపు రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో రూపొందనున్న భారీ ప్రాజెక్టులో కూడా కియారా హీరోయిన్ గా ఎంపికైంది అంటున్నారు. ఈ నేపథ్యంలో కియారా ఎగ్జైటింగ్ అనౌన్స్మెంట్ అని ప్రకటించడంతో… ఆమె నటించబోయే తెలుగు చిత్రం గురించే ఈ అనౌన్స్మెంట్ అని ఫిక్స్ అయ్యారు అభిమానులు. దీంతో ఈ బ్యూటీ ఏ స్టార్ హీరో తో రొమాన్స్ చేయబోతుందో అనే ఆసక్తి మొదలైంది అందరిలో.