Sharanya: ‘లైఫ్ ఆగమాగం చేశారు.. బాబును జాగ్రత్తగా చూసుకోండి’ ఈశ్వర్ సాయి భార్య ఆత్మహత్యాయత్నం..

  • ఈశ్వర్ లేకపోతే బతకలేను..
  • ఆడియో రిలీజ్ చేసి ఈశ్వర్ సాయి భార్య ఆత్మహత్యాయత్నం..
Eshwar Sai Wife Sharanya

Eshwar Sai Wife Sharanya

Sharanya: తెలుగు ఫోక్ ఇండస్ట్రీలో చెలరేగిన వివాదం విషాదాంతానికి దారితీసింది. జానపద పాటల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న డాన్సర్లు ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ మధ్య మొదలైన వ్యక్తిగత గొడవలు చివరకు ఆత్మహత్యలు చేసుకునే స్థాయికి చేరాయి. పెళ్లి పేరుతో తనను మోసం చేశాడంటూ మాధురి రాథోడ్ పోలీసులను ఆశ్రయించడం, సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. అయితే, ఈ రచ్చ తారస్థాయికి చేరిన వేళ.. ఈశ్వర్ సాయి భార్య శరణ్య వాయిస్ నోట్ రిలీజ్ చేసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం చర్చనీయాంశంగా మారింది. ఆత్మహత్యాయత్నానికి పాల్పడటానికి కొన్ని క్షణాల ముందే శరణ్య రిలీజ్ చేసినట్లు చెబుతున్న ఆడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

“నేను ఈ పోరాటంలో పూర్తిగా మోసపోయాను.. ఈశ్వర్ లేకపోతే నేను అస్సలు బతకలేను. నా జీవితాన్ని అందరూ కలిసి పూర్తిగా ఆగమాగం చేసేశారు. నా కళ్ల ముందు ఇదొక్కటే మార్గంగా కనిపిస్తోంది. ఈ మోసాన్ని, ద్రోహాన్ని నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. దయచేసి నా కొడుకుని అందరూ కలిసి జాగ్రత్తగా చూసుకోండి..” అంటూ ఈ ఆడియో బయటకు వచ్చిన కొద్దిసేపటికే ఆమె అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు సమాచారం. శరణ్య అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో ఆమెకు అత్యవసర చికిత్స అందిస్తున్నారని, ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని సమాచారం. భార్యాభర్తల బంధం మధ్యలోకి వచ్చిన వివాదం, సోషల్ మీడియా ట్రోలింగ్, వరుస వివాదాలే శరణ్యను ఇంతటి తీవ్ర నిర్ణయం తీసుకునేలా పురికొల్పాయని కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారని, ఆడియో రికార్డింగ్ ఆధారంగా కేసు దర్యాప్తును మరింత ముమ్మరం చేసే అవకాశం ఉందని సమాచారం.