యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ సహా పలు నిర్మాణ సంస్థలలో సినిమా చేసేందుకు అడ్వాన్స్ తీసుకున్నారంటూ ఇటీవల మీడియాలో వార్తలు హల్‌చల్ చేశాయి. ఈ వార్తలను ఖండిస్తూ, డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. “డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ / డీవీవీ దానయ్య నుంచి ఎలాంటి అడ్వాన్సులు తీసుకోలేదు. ఈ ప్రచారం పూర్తిగా అబద్ధం, అర్థరహితం. మేం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇరువర్గాల మధ్య ఎలాంటి ఒప్పందం గానీ, వృత్తిపరమైన అనుబంధం గానీ లేదు. అందువల్ల అన్ని మీడియా సంస్థలు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, సోషల్ మీడియా పేజీలు వాస్తవాలను ధృవీకరించకుండా ఈ విధమైన తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయవద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం” అని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ తమ ప్రెస్ నోట్‌లో పేర్కొంది.
ALso Read :Allu Mega Families: వివాదాల ప్రచారం అంతా ఒట్టిదే
నిర్మాత డీవీవీ దానయ్య గత కొన్నేళ్లుగా ఆయన తన కుమారుడు కళ్యాణ్ దాసరిని హీరోగా ఇంట్రడ్యూస్ చేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా, కళ్యాణ్ దాసరిని సూపర్ హీరోగా పరిచయం చేస్తూ మూడేళ్ళ కిందటే ‘అధీర’ అనే చిత్రాన్ని ప్రకటించారు. ‘హను-మాన్’ నిర్మాత నిరంజన్ రెడ్డి ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 2022 మార్చిలోనే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ గ్లింప్స్ కూడా విడుదలయ్యాయి. అయితే, చాలాకాలం పాటు ఈ సినిమాపై ఎలాంటి అప్‌డేట్ రాలేదు. తాజాగా, ప్రశాంత్ వర్మ సెప్టెంబర్ 22న సోషల్ మీడియాలో ఓ పోస్టర్‌ను పంచుకుంటూ ‘అధీర’ చిత్రం గురించి కీలక విషయాన్ని తెలియజేశారు. ఈ సినిమాలో సూపర్ హీరోగా కళ్యాణ్ నటిస్తుండగా, విలక్షణ నటుడు **ఎస్‌జే సూర్య** విలన్‌గా నటిస్తున్నట్లు ఆయన ధృవీకరించారు.