సాక్షి దినపత్రికలో వంద వారాల పాటు ఏకధాటిగా సాగిన పాపులర్ ఇంటర్వ్యూల శీర్షిక ‘డబుల్ ధమాకా’ పుస్తకరూపంలో వెలువడింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన భార్య వై.ఎస్. భారతి శుక్రవారం ఉదయం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో ‘డబుల్ ధమాకా’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. సినిమా, సాహిత్యం, రాజకీయం, నృత్యం, సంగీతం, క్రీడలు, టీవీ, సమాజం.. ఇలా వివిధ రంగాలలోని ఇద్దరేసి ప్రముఖులను కూర్చోబెట్టి జర్నలిస్టు ఇందిర పరిమి చేసిన ప్రత్యేక ఇంటర్వ్యూల సమాహారమే ఈ పుస్తకం.

అప్పట్లో సంచలనం సృష్టించిన ఆ ఇంటర్వ్యూలని ఎమెస్కో పబ్లికేషన్స్ పుస్తక రూపంలో ప్రచురించారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, లక్ష్మీ సజ్జల, ఎమెస్కో విజయ్ కుమార్, జర్నలిస్ట్ ఇందిర పరిమి తదితరులు పాల్గొన్నారు. పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్ దంపతులు, ఇతర ప్రముఖులు ఇందిర పరిమి ప్రయత్నాన్ని అభినందించారు.