ఇండియన్ ఐకానిక్ డైరెక్టర్ శంకర్ ‘అపరిచితుడు’ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది. బాలీవుడ్ సూపర్ స్టార్ రణ్వీర్ సింగ్ ‘అపరిచితుడు’ రీమేక్ లో హీరోగా నటించనున్నారు. పెన్ మూవీస్ బ్యానర్ పై జయంతిలాల్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా నిర్మించనున్నారు. తమిళంలో ‘అన్నియన్’గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో ‘అపరిచితుడు’ పేరుతో విడుదలైంది. 2005లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న వ్యక్తిగా మూడు పాత్రల్లో అద్భుతంగా నటించిన చియాన్ విక్రమ్ నటనకు దక్షిణాది ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మరి ‘అన్నియన్’ రీమేక్ లో రణ్వీర్ నటన ఎలా ఉంటుందో చూడాలి. ఇటీవల కాలంలో సౌత్ సినిమాలు వరుసగా బాలీవుడ్ లో రీమేక్ అవుతున్నాయి. తెలుగులో హిట్ అయిన ‘టెంపర్’ రీమేక్ ‘సింబా’తో బడా హిట్ అందుకున్నాడు రణ్ వీర్. రణ్‌వీర్ నటించిన ‘సూర్యవంశీ, 83’ సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. ఇక ‘జయేష్‌భాయ్ జోర్ దార్’ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ‘సర్కస్’ షూటింగ్ లో ఉంది. మరోవైపు కమల్ హాసన్ తో ‘ఇండియన్2’, రామ్ చరణ్ తో పాన్ ఇండియా మూవీలతో బిజీగా ఉన్నాడు శంకర్. ఇక 2022 వేసవిలో ‘అన్నియన్’ రీమేక్ ప్రారంభం కానుంది.